వార్తలు రాజకీయం దేశీయం
సీపీఎం.. మళ్లీ ఏమి తేల్చకుండానే అఖిలభారత మహాసభలు ముగిసిపోయాయి. గతంలో వామపక్షాలంటే అటు బీజేపీకి, కాంగ్రెసుకు గుండెల్లో గుబులు పుడుతుండేది. బడుగు బలహీన వర్గాలు, శ్రామిక శక్తులు ఏకం కావాలనేది మార్క్సిస్టు సిద్దాంతం. కులమతాలకు అతీతంగా వ్యవహరించాలనేది పొలిటికల్ లైన్. ఏ కులానికి చెందినప్పటికీ బలహీనుల తరఫున ఉండాలనే నియమాన్ని ఎప్పుడో పార్టీ తన ఆచరణగా పెట్టుకుంది. అయితే ఈ విధానం ఓట్లు రాల్చడం లేదని గ్రహించిన అగ్రనాయకత్వం తన రూటు మార్చింది. కాంగ్రెసుతో ఎటువంటి పొత్తు, అవగాహన లేకుండానే బీజేపీపై పోరాటం చేయాలనే కేంద్రకమిటీ చేసిన రాజకీయ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర కమిటీ మైనారిటీ ఆలోచన పేరిట సీతారాం పంథానూ ప్రతినిధుల ముందు పెట్టారు. ఇరువర్గాలు కఠినంగా వ్యవహరిస్తే పార్టీలోనే చీలిక వచ్చే ప్రమాదం ఉండేది. కానీ పెద్దలు జోక్యం చేసుకుని మధ్యేమార్గాన్ని అన్వేషించారు. కాంగ్రెసుతో పొత్తు ఉండదు. కానీ ఆ పార్టీతో పార్లమెంటరీ పరిధిలో కలిసిపనిచేస్తామంటూ సవరణ ప్రతిపాదించారు. ఇక కాంగ్రెసుతో అవగాహన ఉండదన్న అసలు ప్రతిపాదన నుంచి అండర్ స్టాండింగ్ పదాన్ని కూడా తొలగించారు. అంటే కాంగ్రెసుతో అండర్ స్టాండింగుతో పనిచేసే అవకాశాన్ని అట్టే పెట్టుకున్నారు. సీతారాం మాట నెగ్గినట్లయింది. కానీ ప్రకాశ్ కారత్ వర్గం మాత్రం దీనితో ఏకీభవించడం లేదు. తీర్మానంలో పెద్దగా తేడాలేదు. కాంగ్రెసుతో కలిసే ప్రశ్నే లేదంటూ తీర్మానం అయిన రోజే బృందా కారత్ తేల్చి చెప్పేశారు. అంటే విభేదాలు తీర్మాన ప్రతి అంటే కాగితం సర్దుబాటుకే పరిమితమయ్యాయి తప్పితే పూర్తిగా సమసి పోలేదన్న మాట. ఇది కొత్త ప్రధాన కార్యదర్శి ఏచూరి సారధ్యానికి సవాలే.గతంలో షెడ్యూల్డు కులాలు, తెగల ప్రజలు దేశవ్యాప్తంగా కాంగ్రెసుపార్టీని ఎక్కువగా ఆదరించేవారు. ఇందిర సమయంలో ఇందుకు పునాదులు పడ్డాయి. ప్రాంతీయశక్తులు, బహుజన సమాజ్ వంటిపార్టీల కారణంగా కాంగ్రెసు ఈ వర్గానికి దూరమయ్యింది. ఈ పొలిటికల్ స్పేస్ ను తాను ఆక్రమించాలనే ఉద్దేశంతో లాల్ నీల్ నినాదాన్ని ఎత్తుకుంది మార్క్సిస్టు పార్టీ. ఇది ఒక రకంగా కుల సమీకరణగానే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజలను ఏదో ఒక ఆకర్షణీయ అంశంతో ఆకట్టుకోవాలనే తాపత్రయం కనిపిస్తోంది. మెజార్టీ ప్రజలు పేదలైన దళిత వర్గాలు ఇంకా పరపీడనలో నలుగుతున్నారు. వారి ఆర్థిక స్థితి కూడా ఏమంత బాగుపడలేదు. అయితే కమ్యూనిస్టు పార్టీ వీరికి ఎప్పట్నుంచో అండగా ఉంటూ వస్తోంది. అయితే వారంతా పేద వర్గం అనే కోటాలో మాత్రమే. అయితే తాజాగా కులపరమైన కేటాయింపుతో వారికి నీల్ రంగు పులమడమే ప్రశ్నార్థకమవుతోంది. ఇది పక్కా రాజకీయ క్రీడ. ఓట్ల విన్యాసం.
చిన్నపార్టీలే అయినప్పటికీ సైద్ధాంతిక నిబద్ధత, ఆచరణాత్మక పోరుతో భయపెట్టేవి. కానీ గడచిన రెండు దశాబ్దాల్లో వచ్చిన మార్పుల్లో వామపక్షాలూ ఆ తాను ముక్కలే అన్నరీతిలో ప్రచారం సాగడం, కొందరు నాయకుల స్వార్థం వెరసి ప్రజల్లో చులకన చేశాయి. సీపీఎంకు సంబంధించి చూస్తే… అంతర్గత పోరు, వయసుడిగినా పదవులు వీడని నేతలు పార్టీని కుంగదీశాయి. పార్టీకి కొత్త రక్తం ఎక్కించలేకపోతున్నారు. పాతచాదస్తాన్ని వదులుకోలేకపోతున్నారు. ఆచరణాత్మక వాస్తవాలు గుర్తించలేకపోతున్నారు. అదే పార్టీ ప్రాబల్యం కోల్పోవడానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. హైదరాబాదు నగరంలో నిర్వహించిన పార్టీ జాతీయ సమావేశంలోనూ కరడుగట్టిన పదజాలం తప్ప నిర్దిష్ట కార్యాచరణ కరవైంది. సర్దుబాట్లు,రాజీలతో పార్టీలో ఐక్యతను చాటుకోవడానికి ప్రయత్నించారే తప్ప విభేదాలకు స్వస్తి చెప్పలేకపోయారు. దీంతో ఇంటాబయటా ఇకపైనా పోరు తప్పకపోవచ్చు. బయట బీజేపీ, మతవాద శక్తులతో సమరం సాగించాల్సి ఉంటుంది. పార్టీ అంతర్గతంగా ఆధిపత్య పోరునూ భరించాల్సి వస్తుంది. ఇదే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారాం ఏచూరికి పెద్ద తలపోటు.సీపీఎం పార్టీలో గడచిన రెండేళ్లుగా ఒకటే చర్చ సాగుతోంది. పశ్చిమబంగ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసుతో కలిసి వెళ్లడం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోయిందనేది ఒక వర్గం వాదన. ఈ వాదన ప్రధానంగా కేరళ పార్టీ శాఖ నుంచి వచ్చింది. 34 సంవత్సరాలపాటు పాలించిన రాష్ట్రంలో మూడోస్థానానికి దిగజారిపోవడాన్ని కేరళ కామ్రేడ్లు ఎత్తిచూపారు. పోరాట పటిమ కోల్పోయిన పశ్చిమ బంగ శాఖ మాత్రం కచ్చితంగా కాంగ్రెసుతో కలవాలనే వాంఛిస్తోంది. ఈ వాదనకే ప్రధాన కార్యదర్శి ఏచూరి మద్దతు పలికారు. అవసరమైన సందర్బాల్లో కాంగ్రెసుతో కలిసి పనిచేయాలి. సర్దుబాటు చేసుకోవాలని కేంద్ర కమిటీలో ఆయన తీర్మానాన్ని ప్రవేశ పెడితే సభ్యులు దానిని ఓడించేశారు. దీంతో రాజకీయ పంథా విషయంలో పార్టీలో తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి. కారత్, సీతారాం వర్గాలు రెండూ అత్యున్నత వేదిక అయిన పార్టీ కాంగ్రెసులోనే ఈ విషయాన్నితేల్చుకోవాలని భావించారు. దీంతో హైదరాబాదు సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడినప్పటికి... ప్రకాశ్ కారత్ అనుకున్నట్టే చివరికి కొనసాగింది
సీపీఎం..మళ్లీ పాత సీసాలో కొత్త సారా..!!