YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఖమ్మం గుమ్మంలో గులాబీకి దారేది...

ఖమ్మం గుమ్మంలో గులాబీకి దారేది...
ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి. కొత్తపంచాయ‌తీరాజ్ చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చింది. స్థానిక సంస్థల ఎన్నికుల‌కు పార్టీలు సిద్ధమ‌వ‌తున్నాయి. కానీ ఖ‌మ్మంలో మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీని మాత్రం లీడ‌ర్ల కొర‌త వెంటాడుతోంది. దీంతో పార్టీ క్యాడ‌ర్ కూడా ఆందోళ‌న‌కు గుర‌వుతోంది. ఖ‌మ్మం జిల్లాలో ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు, జ‌డ్పీ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌, ప‌లువురు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు గులాబీ గూటికి చేరారు. వైసీపీ నుంచి గెలిచిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, వైరా ఎమ్మెల్యే బాణోతు మ‌ద‌న్‌లాల్ కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఖ‌మ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్ అధికార‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. అంతేగాకుండా వివిధ పార్టీల‌కు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయ‌కులు, కార్యక‌ర్తలు చేరారు.టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జిల్లా కమిటీలను రద్దు చేసి ఏడాదిన్నర దాటింది. వాటి స్థానంలో నియోజకవర్గ కమిటీలు నియమిస్తామని ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలను సమన్వయం చేసుకునే బాధ్యతలు అప్పగించారు. కాగా ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే లేని చోట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి ఆధ్వర్యంలో నియమించాల్సిన కమిటీలను ఇప్పటివరకు నియమించలేదు. దీంతో పార్టీ క్యాడ‌ర్లో మ‌రింత గంద‌ర‌గోళం నెల‌కొంది. వివిధ పార్టీల నుంచి వ‌చ్చి చేరిన నాయ‌కులు, కార్యక‌ర్తల మ‌ధ్య స‌మ‌న్వయం లోపించిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.కానీ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. నామినేటెడ్‌ పదవులు రాకపోయినా సంస్థాగత పదవులు వస్తాయని ఎదురుచూస్తున్న క్యాడ‌ర్‌కు నిరాశే ఎదురైంది. గత ఎన్నికల్లో జిల్లాలో కేవలం కొత్తగూడెంలోనే టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. అనంత‌రం వ‌ల‌స‌ల‌తోనే టీఆర్ఎస్ పార్టీ బ‌ల‌ప‌డింది. అన్ని పార్టీల నుంచి రాష్ట్ర, జిల్లా, మండల, స్థానిక నాయకులు ఇబ్బడిముబ్బడిగా టీఆర్‌ఎస్‌లో చేరారు.ఈ క్రమంలోనే పార్టీలో స‌మ‌న్వయం లోపించ‌ద‌నే ప్రచారం జ‌రుగుతోంది. గ‌త‌ అక్టోబరులో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ జిల్లాకు చెందిన డాక్టర్‌ తెల్లం వెంకట్రావుకు రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు ఇవ్వడంతో పాటు అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల సమన్వయకర్తగా నియమించారు. కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి నియోజకవర్గాలకు డోర్నకల్‌కు చెందిన నూకల నరేశ్‌రెడ్డిని సమన్వయకర్తగా నియమించారు.వాస్తవంగా గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జిల్లాలో ఒక్క కొత్తగూడెం సీటు మాత్రమే టీఆర్ఎస్ గెలుచుకుంది. త‌ర్వాత కేవ‌లం వ‌ల‌స‌ల‌తో మాత్రమే బ‌లోపేతం అయ్యింది. ఉప ఎన్నిక‌ల్లో పాలేరులో తుమ్మల గెలిచారు. అయితే మ‌ధిర‌, స‌త్తుప‌ల్లితో పాటు రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఇక్కడ విప‌క్షాలు బ‌లంగా ఉన్నాయి. తుమ్మల లాంటి వాళ్లను మిన‌హాయిస్తే చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన నాయ‌కులు లేరు. స్థానిక సంస్థల ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో అధికార పార్టీని లీడ‌ర్ల కొర‌త వెంటాడ‌డం, ఈ ప‌రిస్థితిని కాంగ్రెస్ త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకోవ‌డానికి ప్రయ‌త్నం చేస్తోంది.

Related Posts