YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఒకటి, రెండు రోజుల్లో కొత్త వీసీలు

ఒకటి, రెండు రోజుల్లో కొత్త వీసీలు

హైదరాబాద్, ఫిబ్రవరి 10, రాష్ట్రంలో తొమ్మిది విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతులు (వీసీ) రాబోతున్నారు. పది రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశమున్నది. ఈ దిశగా ఎన్నికల కమిషన్‌ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈలోగా విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. సామాజిక తరగతుల వారీగా వీసీలుగా బాధ్యతలు అప్పగించేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సమాలోచనలు చేస్తున్నారు. ఇద్దరు లేదా ముగ్గురు ఓసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఇద్దరు బీసీ, ఒక మహిళ, ఒక మైనార్టీకి కేటాయించే అవకాశమున్నది. ఆయా సామాజిక తరగతుల్లో ఎవరైనా మహిళ ఉంటే ఆ కోటా నుంచి పురుషునికి అవకాశం లేనట్టేనని తెలుస్తున్నది. వీసీలను వీలైనంత త్వరగా నియమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల గవర్నర్‌, వర్సిటీ చాన్సలర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రక్రియ వేగవంతమైనట్టు సమాచారం. అందులో భాగంగానే వీసీల నియామకానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్‌ కమిటీల భేటీ సోమవారం నుంచి ప్రారంభమైంది. సోమవారం సాయంత్రం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో తెలంగాణ విశ్వవిద్యాలయం సెర్చ్‌ కమిటీ జరిగింది. బుధవారం ఓయూ, జేఎన్టీయూ హైదరాబాద్‌, ఎంజీయూ, అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం సెర్చ్‌ కమిటీల సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 12న కాకతీయ, శాతవాహన విశ్వవిద్యాలయాల వీసీల కోసం నియమించిన సెర్చ్‌ కమిటీలు భేటీ కానున్నాయి. పాలమూరు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల సెర్చ్‌ కమిటీల భేటీ తేదీలు ఇంకా ఖరారు కాలేదని తెలుస్తున్నది. రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు (వీసీ) నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు 2020, ఫిబ్రవరి 19న ఆదేశించారు. దాంతోపాటు విశ్వవిద్యాలయాలకు పాలకమండలి (ఈసీ) సభ్యుల నియామకాలు సత్వరం పూర్తి చేయాలన్న ఆదేశాలు మాత్రం అమల్లోకి వచ్చాయి. వీసీల నియామకం కోసం ఇప్పుడు కసరత్తు ప్రారంభించడం గమనార్హం. రాష్ట్రంలో 2019, జులై 24వ తేదీతో ఎనిమిది విశ్వవిద్యాలయాల రెగ్యులర్‌ వీసీల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. అదే రోజు నుంచి ఐఏఎస్‌ అధికారులకు ప్రభుత్వం ఇన్‌చార్జి వీసీలుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) రెగ్యులర్‌ వీసీ పదవీకాలం 2019, జూన్‌ 29న ముగిసింది. రాష్ట్రంలో ఇన్‌చార్జి వీసీలుగా జేఎన్‌ఏఎఫ్‌ఏయూకు చిత్ర రామచంద్రన్‌, ఓయూ, ఎంజీయూకు అర్వింద్‌కుమార్‌, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీకి నీతూకుమారి ప్రసాద్‌, బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి సి పార్ధసారథి, జేఎన్టీయూహెచ్‌కు జయేష్‌రంజన్‌, కాకతీయ వర్సిటీకి బి జనార్ధన్‌రెడ్డి, ఆర్జీయూకేటీ, పాలమూరు విశ్వవిద్యాలయానికి రాహుల్‌బొజ్జా, శాతవాహన యూనివర్సిటీకి టి చిరంజీవులు కొనసాగుతున్నారు.రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వీసీల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం 2019, సెప్టెంబర్‌ 23న సెర్చ్‌కమిటీలను ప్రకటించింది. 2019, జులై 9 నుంచి 23 వరకు దరఖాస్తులు ఆహ్వానించింది. తొమ్మిది విశ్వవిద్యాలయాలకు 984 దరఖాస్తులొచ్చాయి. మొత్తం 273 మంది ప్రొఫెసర్లు 984 దరఖాస్తులు చేశారు. అంటే ఒకే ప్రొఫెసర్‌ ఒకటి కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి 142, అత్యల్పంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి 23 దరఖాస్తులొచ్చాయి. ఓయూకు 114, కేయూకు 110, టీయూకు 114, ఎస్‌యూకు 125, పీయూకు 122, ఎంజీయూకు 124, జేఎన్టీయూ హైదరాబాద్‌కు 56 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. వాటిని సెర్చ్‌ కమిటీలు పరిశీలించి ఒక్కో విశ్వవిద్యాలయానికి ముగ్గురు ప్రొఫెసర్ల జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నాయి. అయితే దరఖాస్తు చేయని వారి పేరునూ సిఫారసు చేసే అధికారం సెర్చ్‌ కమిటీలకు ఉన్నది. దరఖాస్తు చేసిన వారికే వీసీ పదవీ రావాలన్న నిబంధన ఎక్కడా లేదు. ఆ తర్వాత ఆ జాబితాను విశ్వవిద్యాలయాల చాన్సలర్‌, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదానికి ప్రభుత్వం పంపిస్తుంది. ఆ తర్వాత వీసీల నియామకం జరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే జరిగే అవకాశముందని తెలుస్తున్నది.

Related Posts