అన్నమాచార్య కళామందిరంలో శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు
తిరుపతి, ఫిబ్రవరి 10
టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు బుధవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసిన 400 మందికిపైగా భజన మండళ్ల కళాకారులు శ్రీ పురందరదాస కీర్తనలను చక్కగా ఆలపించారు. ఉదయం 10 నుండి రాత్రి 8 గంటల వరకు బృందాల వారీగా కళాకారులు దాస పదాలను గానం చేశారు. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 11న అలిపిరిలో పుష్పాంజలి
ఆరాధనోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 11న గురువారం ఉదయం 6 గంటలకు అలిపిరి వద్దగల శ్రీ పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తారు. అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు హరిదాసరంజని కళాకారులతో సంగీత కార్యక్రమం, పండితుల ధార్మికోపన్యాసాలు, పురందరదాస సంకీర్తన విభావరి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.