మనం ఈశ్వరునివైపు తిరిగితే ఆయన మనల్ని తప్పక స్వీకరిస్తాడు, మనం పశువులకంటే భిన్నమైన జీవితాన్ని గడపటంలేదు కదా. మనం మన శక్తిలో,కాలంలో చాలా భాగాన్ని ఉదరపోషణకే వినియోగిస్తున్నాం. మిగిలిన కాలంలో ఎక్కువ భాగాన్ని నిద్రలో వెచ్చిస్తున్నాం. అటువంటప్పుడు పశువులకంటె భిన్నమైన వారమని ఎలా చెప్పుకోగలం, దేవునిపట్ల ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపితే వినా, శివభుజంగ స్తోత్రమ్ లో శ్రీ భగవత్పాదులు శివుని ఇదే ప్రశ్న వేసి, తాను పశువుతో సమానమైనా తనను స్వీకరించమని వేడుకొన్నాడు. ఎందుకని? శివుని వాహనం నందియే కదా. ఒక వృషభమైన నందిని స్వీకరించగలిగినప్పుడు పశువు వంటి భక్తుని స్వీకరించలేడా ? ఒక భక్తుడు పశువువలె ఉన్నాడని శివుడు ఎలా అనగలడు ఒక పశువునే తన స్వంతం చేసుకోగలిగినప్పుడు . పశువుతో సమానంగా ఉండటం ఒకయెత్తయితే, పాపము చేసినవాడవటం మరొక యెత్తు. భక్తుడు పాపం చేసినవాడయితే ఏమిటి? ఈశ్వరుడు అతన్ని స్వీకరిస్తాడా? ఘోరమైన పాపాన్ని చేసిన చంద్రుణ్ణి తన తలమీద శివుడు ధరించలేదా? తన గురువైన బృహస్పతి భార్య తారతో రమించి పుత్రుని కనలేదా ! అటువంటి తప్పులను చేసిన చంద్రుని శివుడు తన తలమీద ధరిస్తున్నాడంటే దోషాల కారణంగా భక్తులను భగవంతుడు తిరస్కరించడని ఖచ్చితంగా తెలుస్తోంది. పశువుతో సమానులైనా, దోషపూరితులైనా భక్తులను శివుడు స్వీకరించవచ్చు. అయితే భక్తునిలో రెండు నాల్కల ధోరణి కనపడకుండా ఉండాలి కదా ! భక్తుడు ద్వంద్వ ప్రమాణాలు లేకుండా ఉండాలి కదా! ఇక్కడ కూడ భగవత్పాదులు మరో విషయాన్ని శివునికి చెప్తున్నారు " ద్వంద్వ నాల్కల ధోరణికి నీవు వ్యతిరేకుడవైతే రెండు నాల్కల సర్పాన్ని కంఠ భూషణంగా ఎలా స్వీకరించావు ? సర్పాన్ని స్వీకరించినప్పుడు నన్నెందుకు స్వీకరించవు ? చివరిలో భగవత్పాదులు గుర్తుచేస్తున్నారు. వ్యక్తి పరిస్థితి ఏది అయినప్పటికి, పరమాత్మ దయను పొంది ఆశీస్సులనందుకొంటాడు. ఈ ప్రార్థన భావార్థమేమంటే ఈశ్వరుని దయ అపారం. మనలో ఎన్ని దోషాలున్నా, మనకెన్ని పరిమితులున్నా భగవంతుని శరణుజొచ్చితే , ఆయన మనల్ని ఆదరిస్తాడు.
పశుం వేత్సి చేన్మార తమేవాధిరూఢః
కలంకీతి వామూర్ధ్ని ధత్సే తమేవ !
ద్విజిహ్వః పునః సోఽపి తే కణ్ఠ భూషా
త్వదంగీకృతాః శర్వ సర్వేఽపి ధన్యాః ॥