YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

వికట, ధూమ్రవర్ణ - గణపతి నామాలకు అర్ధం.

వికట, ధూమ్రవర్ణ - గణపతి నామాలకు అర్ధం.

ఓం గం గణపతయే నమః
లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తధాష్టమం ||
వికట అనేది గణపతి 8 అవతారాల్లో మొదటిది. దీని గురించి గణేశ పురాణంలో ఉంది. కామాసుర సంహారం కోసం వినాయకుడు మయూరాన్ని (నెమలిని) వాహానంగా చేసుకుని, వికట గణపతి రూపంలో అవతరించి, కామాసురుని అణిచివేశాడు. వికట అనే నామంతో గణపతిని పూజించడం వలన ధర్మబద్దం కానీ కామం నశిస్తుంది. ధర్మం పట్ల అనురక్తి పెరుగుతుంది. పురాణం ప్రకారం ఇది అతి సుందరమైన రూపం. కానీ వికట అనే నామానికి భయంకరమైన, ఉగ్రమైన రూపం కలవాడనే అర్దం కూడా ఉంది. ఇది ఎలాగంటే మోక్షం పొందాలంటే దేహాత్మ భావనను దాటిపోవాలి. నేను దేహం అనుకున్నప్పుడే, స్త్రీ, పురుష మొదలైన వ్యత్యాసాలు, కాకామ, క్రోధాదులు, అందం, వికృతం ఇత్యాది భావాలు వస్తాయి. భక్తులను ఉద్ధరించడం కోసం, వారిలో హద్దులు మీరిన కామభావాలను, అధర్మ నడవడిని తొలగించుటకు, దేహాత్మభావనను దూరం చేయడానికి అత్యంత భీకర రూపంతో కనిపిస్తాడు గణపతి. అందుకని ఆయనకు వికట అనే నామం ఉంది.
ఈ జగత్తు అనేది నాటకం. అందులో అందరిది ఒక్కో పాత్ర. అది అర్దం కాక ఇందులో లీనమై సుఖదుఃఖాది ద్వంద్వాలను అనుభవిస్తాడు మానవుడు. అలా జరగకుండా, కేవలం సాక్షిగా, ఈ జగన్నాటకంలో తన వంతు పాత్ర నిర్వర్తిస్తూనే ప్రేక్షకుడిగా ఈ జగత్తును దర్శింపజేసే శక్తిని అనుగ్రహించగలవాడు కనుక గణపతికి వికట అనే నామం ఉందని సద్గురు శివాయ శుభ్రమునియ స్వామి గారు చెప్పారు.
ధూమ్రవర్ణుడు అంటే పొగ వంటి వర్ణం కలిగినవాడు. దీనికి కూడా గణేశపురాణంలో కధ ఉంది. పూర్వం అహంకారాసురుడనే రాక్షసుడు తన అహంకార ధూమ (పొగ) చేత సర్వలోకాలను ఉక్కిరివిక్కిరి చేసినప్పుడు, దేవ, ఋషి, మానవ గణాలన్నీ గణపతిని వేడుకొనగా, వారి రక్షణ కొరకు అహంకారాసురిని చేత వదలబడిన ధూమాన్ని తన తొండంతో పీలుచుకుని, పొగ వర్ణంలోకి మారిపోయాడు గణపతి. అటు తరువాత వాడిని అణిచి తన అదుపులో పెట్టుకున్నాడు. ఆ లీలను సూచిస్తుందీ నామం. ఈ నామంతో వినాయకుడిని అర్చిస్తే, అహంకారం నశిస్తుంది. నిజానికి  గణేశారాధన ప్రధమంగా అహంకారాన్ని నశింపచేస్తుంది.
గణపతికి నచ్చని గుణాల్లో మొదటిది అహంకారం. అహంకారంతో గణపతిని పూజిస్తే ఆయన అసలు మెచ్చుకోడు. గణపతి చేతిలోని అంకుశం కూడా ఈ అహంకారాన్ని అణిచివేయడానికే ఉంది. అహం నశిస్తేనే ఆధ్యాత్మికతలో పురోగతి ఉంటుంది. లేదంటే ఎంత సాధన చేసినా వృధానే. అటువంటి అహంకారాన్ని నశింపజేయుడువాడు మన గణపతి.
ఓం గం గణపతయే నమః..

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts