వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్.. ఎప్పుడు ఏ ట్వీట్ పెడతారోనని ఆయన అభిమానులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వన్ సైడ్ రాజకీయాలకు తెర లేపారు. అయినా ఏం చేసిన ట్వీట్స్ తోనే సమాధానం తప్ప... జనాల్లోకి వచ్చినవి తక్కువే అభిమానులతోపాటు ప్రజలకు సందేశాలు, ఆందోళనలకు పిలుపులు, రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాలను పవన్ ట్టిటర్ ద్వారా బయటపెడుతుంటారు. తొలినాళ్లలో అప్పుడప్పుడూ ప్రెస్‌మీట్లలో ఆవేశంగా మాట్లాడినా.. ఎక్కువగా ట్విటర్‌లోనే తన అభిప్రాయాలు బయటపెట్టేవారు. ప్రస్తుతం తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలు, జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు మళ్లీ ట్విటర్ ఫార్ములానే ఫాలో అవుతున్నారు పవన్. పార్టీ ప్రకటించి యాక్టివ్ పాలిటిక్స్ లోకి రాక ముందు కూడా ఆయన ట్విట్టర్ ద్వారానే ఎంపిక చేసిన అంశాలపై స్పందించేవారు. తాజాగా ఆయన తన రాజకీయాలకు ట్విట్టర్ పూర్తిస్థాయి వేదికగా మారింది. దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ట్విట్టర్ ద్వారా అయితే `ప్రశ్నలుండవు..సమాధానాలుండవ్`. చెప్పదలచుకున్నది చెప్పేసి వదిలేయవచ్చు.అక్కడ వచ్చే కామెంట్లను పట్టించుకుంటే పట్టించుకుంటారు. లేదంటే లేదు. తనపై ఆరోపణలు చేసిన వారికి అండగా నిలిచిన మీడియా యాజమాన్యాల అధిపతులకు సంబంధించి రహస్యాలు బయటపెడుతూ సంచలనం సృష్టిస్తున్నారు జనసేనాని. ఇందుకు ట్విటర్‌నే తన ఆయుధంగా మలుచుకున్నారు. ఇప్పుడే కాదు గతంలోనూ పవన్ ప్రజాక్షేత్రంలో కంటే ట్విటర్‌నే నమ్ముకున్నారు. దీనిపై ఆయన విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఇలా ట్విటర్ ద్వారా విరుచుకుపడటం కంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి మీడియా ప్రశ్నలకు సమాధానాలు చెబితేనే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను అనుకున్నది స్పష్టంగా చెబుతున్నా.. ఇవి సమాధానాలివ్వడంతో పాటు సందేహాలు కూడా కలిగిస్తున్నాయి. ప్రెస్ మీట్ పెడితే ప్రశ్నలు హడావుడి. పార్టీ పెట్టాక పవన్ పెట్టిన విలేకరుల సమావేశాలు మొత్తం చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటాయి. పవన్ ఈ సారి ముఖ్యంగా ట్విటర్ వేదిక ద్వారా మీడియా సంస్థలనే టార్గెట్ చేశారు. ఈ పోరాటం దీర్ఘకాలం కొనసాగుతుందని మరీ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు.. ఇటు తెలంగాణలో సీఎం కేసీఆర్, అటు ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్లు పెట్టినా విలేకరులు పోటీలు పడి మరీ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టే పరిస్థితి ఏమీ లేదు. కొంతమంది అడిగితే.. గిడిగితే పాలకులకు అనుకూల ప్రశ్నలే వేస్తారు తప్ప రెండో సైడ్ మాత్రం ప్రశ్నలు సంధించలేరు. కొ్న్ని మీడియా సంస్థలపై యుద్ధం ప్రకటించిన పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడితే ఇంకా ఏమైనా ఉంటుందా? అందుకే ఆయన తాను మొదటి నుంచి ఫాలో అవుతున్న `ట్విట్టర్ మోడల్`నే ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఇలా ఎంతోకాలం కుదరదని, ప్రజాక్షేత్రంలో ఉంటేనే ఫలితాలు మెరుగ్గా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
పవన్...ట్విట్టరే వేదిక వన్ సైడ్ కు చెక్ ఎప్పుడు