YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తొలి విడతలో టీడీపీ ఝలక్....

తొలి విడతలో టీడీపీ ఝలక్....

విజయవాడ, ఫిబ్రవరి 11, 
పంచాయతీ ఎన్నికల కోసం చంద్రబాబు బాగానే డిమాండ్ చేశారు. వైసీపీ భయపడిపోతుందని, ఎన్నికలు జరిపి తీరాల్సిందేనని పదే పదే చంద్రబాబు ప్రకటనలు చేశారు. కానీ చివరకు పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూస్తే చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయింది. ఏకపక్షంగా వైసీపీ గెలుచుకోవడంతో ఇప్పుడు పంచాయతీ ఎన్నికల ముందు ఎందుకు వచ్చాయా? అని చంద్రబాబు మదనపడుతున్నారు. పార్టీ నేతలు సక్రమంగా పనిచేయకపోవడం వల్లనే ఈ రిజల్ట్ వచ్చాయని తేల్చేశారు.చంద్రబాబు తొలి నుంచి ఎన్నికల కోసం ఆరాటపడ్డారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించగానే స్వాగతించారు. పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చివరకు పంచాయతీ ఎన్నికలకు మ్యానిఫేస్టోను కూడా విడుదల చేశారు. ఐదేళ్లలో కేంద్రం నుంచి ఒక్కొక్క పంచాయతీకి ఐదు కోట్ల నిధులు వస్తాయని ఊరించారు. సర్పంచ్ పదవి ఐదేళ్లు ఉంటుందని, వైసీపీ అధికారంలో ఉండేది రెండేళ్లేనంటూ నేతలలో జోష్ నింపేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. కానీ 500 పంచాయతీలకు పైగానే ఏకగ్రీవం అయ్యాయి.ఇక తొలి విడత గా 3,249 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే అందులో 500 చోట్ల మాత్రమే టీడీపీ గెలవగలిగింది. మిగిలిన స్థానాలన్నింటిని వైసీపీ గెలుచుకుంది. ఇది చంద్రబాబు ఊహించనది. ఏకగ్రీవాలు కాకుండా అడ్డుకున్నా ఓటింగ్ జరిగి ప్రజలు వైసీపీ పక్షాన నిలవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తాము 40 శాతం గ్రామ పంచాయతీలయినా గెలుచుకుంటామని చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. కానీ అది కూడా సాధ్యం కాలేదు.అయితే చంద్రబాబు తొలివిడత జరిగిన ఎన్నికలపై సమీక్ష జరిపారు. చిత్తూరు జిల్లాతో సహా అన్ని జిల్లాల్లో టీడీపీ ఏమాత్రం పుంజుకోలేదని గ్రహించారు. ఇక రాయలసీమ జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. ఉత్తరాంధ్రలోనూ అదేపరిస్థితి నెలకొంది. కోస్తాంధ్ర జిల్లాలు తమకు కలసి వస్తాయని ఊహించినా అనుకున్న రీతిలో ఫలితాలు రాలేదు. దీంతో అమరావతి రాజధాని అంశం కూడా పెద్దగా పనిచేయలేదు. ఇప్పుడు చంద్రబాబు ఆశలన్నీ పట్టణ ప్రాంతాలపైనే. ఎంపీటీసీ,జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల కోసం ఆయన ఎదురు చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంటుందని అంచనా వేసిన చంద్రబాబుకు పంచాయతీ ఎన్నికల ఫలితాలు నిరాశను మిగిల్చాయి. అయితే వైసీపీ గెలుపునకు పోలీసులే కారణమని విమర్శలు చేస్తున్నారు. అధికారులు అధికార పార్టీకి సహకరించడం వల్లనే వాళ్ల గెలుపు సాధ్యమయిందంటున్నారు.పంచాయతీ ఎన్నికలతో వైసీపీ పతనం ప్రారంభమయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇది వైసీపీకి తన హెచ్చరిక అని చంద్రబాబు తెలిపారు. ఇరవై నెలలుగా జగన్ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థపై దాడులకు పాల్పడిందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి న్యాయవ్యవస్థ వరకూ ఎవరినీ జగన్ వదలిపెట్టలేదన్నారు. తాను ఏర్పాటు చేసిన వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేశారన్నారు. రాజధాని అమరావతిని శ్మశానంగా మార్చారన్నారు. అన్ని వర్గాలపై దాడులు జరుగతున్నాయని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. 90 శాతం పంచాయతీలను గెలిస్తేనే మంత్రిపదవులు ఉంటాయని జగన్ హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. కిడ్నాప్, హత్యలు జరిగినా ప్రజలు ధైర్యంగా నిలబడ్డారన్నారు. నిజమైన హీరోలు ప్రజలేనన్నారు. వారికి నాయకత్వం వహించింది తెలుగుదేశం పార్టీయే నని చెప్పారు. పంచాయతీ ఎన్నికలలో 38 శాతం ఓట్లు టీడీపీకి వచ్చాయన్నారు. దీంతోనైనా బుద్ధి తెచ్చుకోవాలని చంద్రబాబు తెలిపారు. 94 శాతం గెలిచామని ఫేక్ మంత్రులు చెబుతున్నారన్నారు.రానున్న రోజుల్లో తప్పు చేసిన అధికారులను ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని చంద్రబాబు హెచ్చరించారు. అన్ని చోట్ల అరాచకాలకు పాల్పడి వైసీపీ గెలిచుకుందన్నారు. కొన్ని చోట్ల టీడీపీ గెలిచినా వైసీపీ విజయం సాధించినట్లు ప్రకటించారన్నారు. వైసీపీ నేతలు పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. వందల పంచాయతీల్లో టీడీపీ గెలిస్తే తాము గెలుచుకున్నట్లు వైసీపీ ప్రకటించుకున్నారన్నారు. బలవంతపు ఏకగ్రీవాలపై కోర్టుకు వెళతామని చెప్పారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామన్నారు. పిరికితనంతో ప్రజలను ఓట్లేయ్యకుండా ఏకగ్రీవాలు చేసుకున్నారన్నారు. రెండు, మూడు, నాల్గో విడత పంచాయతీ ఎన్నికల్లో ధైర్యంగా నిలబడాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.

Related Posts