వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్
అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి...అంటూ హమ్ చేస్తున్నారు...జంప్ జిలానీలు.. ఇప్పుడు రాజకీయాల్లో జంపింగ్‌లు కామన్ అయిపోయాయి. ఇక పార్టీ మారిన చాలా మంది ఎమెల్యేలు ఇప్పుడు ఎందుకు మారామా ? అని తలలు పట్టుకుంటున్నారు. జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి వర్సెస్ రామసుబ్బారెడ్డి, ఆళ్లగడ్డలో మంత్రి అఖిల వర్సెస్ ఏవి.సుబ్బారెడ్డి, బొబ్బిలిలో మంత్రి సుజయ్ వర్సెస్ తెంటు జయప్రకాష్, అద్దంకిలో గొట్టిపాటి వర్సెస్ కరణం, కందుకూరులో పోతుల రామారావు వర్సెస్ దివి శివరాం ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీలు మారిన ఎమ్మెల్యేలు చివరకు మంత్రులు అయినా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అనుకున్నట్టుగా రాజకీయ నేతలు కూడా తమను ప్రజలు గెలిపించి చంకనెత్తుకున్నప్పుడే ఏదైనా పోగేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే విపక్ష పార్టీలో గెలుపొందినా.. వెంటనే అధికార పార్టీ అభివృద్ధిని మెచ్చుకుంటూ.. ఆ పార్టీ జెండాను కప్పుకొని అజెండా అమలు చేస్తున్నారు. ఇప్పటికి ఇలా 23 మంది వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేశారు.ఈ క్రమంలోనే టీడీపీని బలోపేతం చేసి 2019 ఎన్నికల్లో టీడీపీ జెండాను ఎగురవేయాలన్న ధ్యేయంతో ముందుకు వెళుతుంటే కొంత మంది పార్టీని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఆయన అంటున్నారు. తన నియోజకవర్గం ఎస్సీ అయినప్పటికీ అగ్రవర్ణాల పెత్తనం ఏమిటని ఆయన సొంత పార్టీ మాజీ నేతలపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపార్టీ ఎమ్మెల్యే ఉండగానే రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్త వ్యక్తులను ఎందుకు తీసుకువస్తున్నారని, ఇలా చేయడం వల్ల నేను పార్టీలో చురుకుగా ఎలా పాల్గొనాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాస్థాయి టీడీపీ నాయకులు సైతం కులవివక్ష చూపుతూ ఎస్సీలను అణగదొక్కు తున్నారన్నారు. వీరందరికీ అనుకున్నది అనుకున్నట్టు జరుగుతోందా? అధికార పార్టీలో గౌరవం దక్కుతోందా? అంటే మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది. కొందరు బయటపడుతున్నారు.. మరికొందరు మౌనంగా భరిస్తున్నారు. జంప్ చేసి టీడీపీలోకి వచ్చిన వారికి ఆ పార్టీ సీనియర్ల నుంచి గౌరవం లభించకపోగా.. అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి.ఇప్పుడు ఇలాంటి వారిలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చిన బద్వేలు ఎమ్మెల్యే.. జయరాములు అంశం. ఈయన 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచారు. అయితే, బాబు ఆకర్ష్ మంత్రంతో ఆయన సైకిలెక్కారు. ఇది ఈజీగానే జరిగిపోయిం ది. అయితే, స్థానిక టీడీపీ నేతలతో సమన్వయం చేసుకోవడమే ఇప్పుడు ఈయనకు సముద్రాన్ని ఈదినంత కష్టంగా మారింది. టీడీపీ సీనియర్లే ఈయనకు శత్రువులుగా మారిపోయారు. ఈయనకు తెలియకుండానే నియోజకవర్గంలో పనులు చేసేస్తున్నారు. దీంతో గత కొన్నాళ్లుగా వాళ్ల వైఖరిపై రాములు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలో చేరినప్పటి నుంచి అధిష్టానం పిలుపు మేరకు ఇంటింటికీ తెలుగుదేశం, దళితతేజం, ధర్మదీక్ష వంటి కార్యక్రమాలను ఎంతో విజయవంతం చేశానని ఆయన అంటున్నారు.
అదిష్టానం పిలుపు మేరకు బద్వేలులో ధర్మదీక్ష చేపట్టడం జరిగిందని, అయితే మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పోటీగా మరో శిబిరం ఏర్పాటుచేసి దీక్షలు చేపట్టడం ఏమిటని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమంలో అడ్డుతగులు తూ అడుగడునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. డబ్బున్న నాయకులు, పార్టీ బలోపేతానికి కృషి చేయాలే తప్ప, పార్టీ నాశనానికి కృషి చేయకూడదని ఆయన అన్నారు. ఎవరు లంచాలు తీసుకునేది, ఈ ప్రాంత ప్రజలకు తెలుసన్నారు.
ప్రణాళికా బద్దంగా పార్టీ నాశనం చేయాలన్న లక్ష్యంతో కొంత మంది కంకణం కట్టుకున్నారని ఆగ్రహించారు. అధిష్టానం దృష్టిసారించి తగున్యాయం చేయకపోతే, ఇలాగే అగ్రవర్ణాల పెత్తనం సాగిస్తూ, నన్ను అణగతొక్కాలని చూస్తే రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడే ప్రసక్తేలేదన్నారు. ఇక జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో పాటు జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ లాంటి వాళ్లు కూడా విజయమ్మకే సపోర్ట్ చేస్తుండడంతో జయరాములు మరీ డమ్మీగా మారిపోయారు. ఈ రెండు వర్గాలకు తోడుగా ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన విజయజ్యోతి మరో వర్గంగా ఉన్నారు. మొత్తంగా ఈ పరిణామం గమనిస్తే… జయరాములును సొంత టీడీపీ నేతలే ఎంత భ్రష్టు పట్టించారో అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు. మరి బాబు ఎలా చెక్ పెడతారో చూడాలి.
అనుకొన్నదక్కటి...అయినదొక్కటి... జంప్ జిలానీలకు కొత్త టెన్షన్