న్యూఢిల్లీ ఫిబ్రవరి 11
తూర్పు లఢాక్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై రాజ్యసభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా అంగుళం భూమిని కూడా చైనాకు వదులుకోమని ఆయన స్పష్టం చేశారు. పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల్లో బలగాల ఉపసంహరణకు చైనాతో ఒప్పందం కుదిరిందని ఆయన వెల్లడించారు. దశలవారీగా రెండు దేశాలు తమ బలగాలను ఉపసంహరిస్తాయని ఆయన చెప్పారు. ఈ ఘర్షణలో ఇండియా కోల్పోయింది ఏమీ లేదని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఇప్పటికీ కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదని, చర్చలు కొనసాగుతూనే ఉంటాయని ఆయన తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఆయుధ సంపత్తిని భారీగా పెంచింది. ఇండియా కూడా అందుకు దీటుగా స్పందించింది. వ్యూహాత్మక ప్రదేశాల్లో మన ధైర్యవంతులైన జవాన్లు ఉన్నారు. ఈ ప్రాంతాల్లో మనమే పట్టు సాధించాము. దేశ సమగ్రత కోసం ఎంత వరకైనా వెళ్తామని మన జవాన్లు చాటి చెప్పారు. రెండు వైపులా వాస్తవాధీన రేఖను గౌరవించాలి అని రాజ్‌నాథ్ అన్నారు.లఢాక్‌లో సరిహద్దును కాపాడుకోవడంలో మన జవాన్లు శౌర్యాన్ని ప్రద్శించారు. అందుకే చైనాతో ఘర్షణలో ఇండియా పైచేయి సాధించింది అని ఆయన చెప్పారు. ఆ ప్రాంతంలో మళ్లీ శాంతి నెలకొనాలంటే బలగాల ఉపసంహరణ జరగాల్సిందేనని చైనాకు తేల్చి చెప్పినట్లు రాజ్‌నాథ్ వివరించారు.