భగవన్నామస్మరణతో ఎంతటి కష్టమైనా దూరం అవుతుందని బెంగుళూరు వ్యాసరాజమఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీశతీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన గురువారం తిరుమలలోని ఆస్థాన మండపంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీశతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు అందిస్తూ కలియుగంలో భగవంతుని నామసంకీర్తనమే ముక్తికి మార్గమని పేర్కొన్నారు. పురందరదాసుల వారు తన జీవితాన్ని దాస కీర్తనల రచనకే అంకితం చేశారని చెప్పారు. దాస పదాల ద్వారా అందరికీ అర్థమయ్యేలా సులువుగా భగవంతుని తత్వాన్ని, శరణాగతి విధానాన్ని, ధర్మాన్ని, నైతిక విలువలను తెలియజేశారని వివరించారు.
అనంతరం ఉడిపిలోని పాలిమారు మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాధీశతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు అందిస్తూ పురందరదాస కీర్తనలు భక్తిని విశేషంగా వ్యాప్తి చేస్తున్నాయని తెలిపారు. భగవంతుని నామసంకీర్తన కలియుగంలో అత్యంత ఉత్కృష్టమైన భక్తి మార్గమని పురందరదాసులు చాటి చెప్పారన్నారు. పురందరదాసులవారు అమితమైన భక్తితో స్వామివారిపై అనేక కీర్తనలు రచించారని తెలియజేశారు.
అంతకుముందు దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి ఆర్ ఆనంద తీర్థచార్యులు ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 300 మంది భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.