ఏకాగ్రతే విజయరహస్యం. ఆ సంగతి తెలుసుకున్న వాళ్ళు వివేకవంతులు. కేవలం యోగులకే ఏకాగ్రత అవసరమని అనుకోవడం శుద్ధ పొరపాటు. ప్రతి ఒక్కరికి ఏకాగ్రత అత్యవసరం. ఎవరు ఏ పని చేస్తున్న ఏకాగ్రత అవసరం ఎందుకంటే ఏమరపాటుగా ఉంటే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి. ఉదాహరుణకు సుత్తితో కొడుతున్నప్పుడు కమ్మరి ఏ కొద్దిగా ఏమరపాటుగా ఉన్నా, అతని చేతి మీద సుత్తి దెబ్బ పడే ప్రమాదం ఉంది, అదే విధంగా ప్రతి ఒక్కరికి వారి వారి పనివృత్తులలో మరియు విద్యార్థుల చదువు విషయంలో అన్నిట్లో ఏకాగ్రత అందరికి అవసరం. కాబట్టి అందరూ ఎంతో అప్రమత్తంగా, తమ మనస్సును అదుపులో పెట్టుకొంటూ పని చేస్తుంటారు. దీనిని బట్టి చూస్తే అందరూ నిరంతరం వారి మనస్సును ప్రయత్నం ద్వార ఏకాగ్రతను సాధిస్తున్నారని మనకు అర్ధమవుతుంది. భగవద్గీతలో అర్జునుడు ఈ విధం గా అడుగుతాడు..
అర్జునుడు : కృష్ణా! మనసు ఎంతో చంచలమైనది. అది నిరంతరం అవిశ్రాంతితో చరిస్తూ ఉంటుంది. అదే సమయంలో మనస్సు శక్తివంతమైనది కూడ! దానిని నియంత్రణలో ఉంచడం అంటే గాలిని పట్టి బందించడం లాంటిదే! మరి అలాంటి మనసును నియంత్రణలోకి తీసుకురావడం ఎలా...?
కృష్ణుడు : అర్జునా! నువ్వు చెబుతున్నది నిజమే. మనస్సు చంచలమైనది. దాన్ని నియంత్రించడం అంతా సులభమైన పని కాదన్నది నిజమే! అయితే అంతటి చంచలమైన మనసును సైతం నిరంతర సాధన ,అంటీ ముట్టని ధోరణి అనే బలం ద్వారా నియంత్రణలోకి తీసుకురావచ్చన్నది అంతే నిజం. మనస్సును నియంత్రణలోకి తీసుకురావడానికి అన్నిటికన్నా ముఖ్యంగా, మొట్టమొదట ఓ విషయం తెలుసుకోవాలి. తాము పోరాడదలచిన మనస్సు స్వభావాన్ని స్పష్టంగా అర్ధం చేసికోవాలి. మనస్సనేది కోతి లాగ చంచలమైనది. తప్పతాగి మత్తెక్కిన ఏనుగు లాగ చాల బలమైనది. అలాంటి మనసును నియంత్రించడమనేది అర్జునుడు చెప్పినట్లుగా, గాలిని పట్టుకోవడం లాంటిదే! కోతులను పట్టుకోవడంలోను, ఏనుగులకు శిక్షణ ఇవ్వడం లోను ఎలాంటి నైపుణ్యం అవసరమో – అంతా నేర్పు మనస్సును క్రమబద్దీకరించడానికి కావాలి. భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికీ, ప్రతి వస్తువుకు ఓ విలక్షణమైన స్వభావం ఉంటుంది. ఉదాహరణనకు వీయడమనేది గాలి స్వభావం. కాల్చడమనేది నిప్పు స్వభావం. పారడమనేది నీటి స్వభావం. అదే విధంగా ప్రతిదాంట్లో తల దూర్చడం, ఒక విషయం మీద నుంచి మరో విషయానికి దూకడం, విచిత్రమైన కోరికలు కోరడం, వేలాది విషయాల గురించి ఆలోచించడం, ఎన్నెన్నో సమస్యల గురించి దుఃఖించడం, గాలిలో మేడలు కట్టడం, మనకు అప్పగించిన పని గురించి కాకుండా మిగిలిన ప్రతి ఒక్క పని గురించి పట్టించుకోవడం – ఇదీ మనస్సు స్వభావం.
ఇటువంటి మనస్సును నియంత్రించగలిగితే, మనం ఎంతటి ఉన్నత లక్ష్యాలనైనా సాధించ గలుగుతాం. మరి మనసును ఎలా నింత్రించాలి? ఆ పని ఎలా చేస్తాం? మన శరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాల పాత్ర ఇక్కడ వస్తుంది. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం – ఈ అయిదు మనసుకు వాహనాలు. జ్ఞానేంద్రియాలన్ని మనస్సును అన్ని వైపులా లాగుతూ ఉంటాయి. కాబట్టి, వివేకాన్ని ఉపయోగించడం ద్వార ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ఇలా ఇంద్రియాలను అదుపులో ఉంచడాన్నే సంస్కృతంలో ‘దమం’ అంటారు. నిజానికి ,ఇంద్రియాల సహాయం లేకుండానే స్వతంత్రంగా కూడా ఇష్టమొచ్చిన చోటుకు మనస్సు పోగలదు. అలాంటి సందర్భాలలో బుద్దిని ఉపయోగించి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఇలా తిన్నగా మనస్సును నిశ్చలంగా ఉంచే పద్ధతినే ‘శమం’ అంటారు. మనస్సు గురించి, దాని ఏకాగ్రత గురించి ఎన్నో వివరాలు తెలిసిన తరువాత, ‘అసలింతకీ, మనసును అదుపులో పెట్టాల్సిన అవసరం ఏమిటి?’ అని కొందరు అడుగవచ్చు. దీనికి సరైన సమాధానం తెలుసుకొని తీరాలి. దానికి సరైన జవాబు ఒక్కటే: మనస్సు గనక అదుపులో ఉంటె ఉన్నత లక్ష్యాలను సైతం సాధించాగాలుగుతాం. అదే మనస్సు అదుపులో లేనట్లయితే, అత్యంత సామాన్యమైన పనులు చేయడం కూడా సాధ్యం కావు. మనస్సుకు నిజంగానే అపారమైన రాక్షస బలం ఉంటుంది. ప్రాచీనకాలంలో మన ఋషులు నిరంతర ప్రయత్నాలతో మనస్సును తమ అదుపులోకి తెచ్చుకొని ,మానసిక సమతౌల్యాన్ని సాధించారు. అదే వారు చేసిన మొదటి పని. అలాంటి మనసును ఏకాగ్రపరిచినప్పుడు అద్భుతమైన యోగ రహస్యాలను వారు కనుగోనేలా అది (మనస్సు) చేసింది. అది వారికి దివ్య జ్ఞానాన్ని అందించింది. స్వామి వివేకానంద చెప్పినట్లు, ఏకాగ్రతతో కూడుకున్న మనస్సు నిజంగా ఓ సెర్చి దీపం లాంటిది. దూరంగా, చీకటి మూలల్లో పడి ఉన్న వస్తువులను కూడా మనకు కనిపించేలా చేస్తుంది ఆ సెర్చి దీపం. సరే! మనస్సును ఏకాగ్రపరచాలన్న మాట నిజమే? కానీ, దాన్నీ ఏ వస్తువు మీద ఏకాగ్రపరచాలి? మనం అందరం యోగులం అవడానికి ప్రయత్నిస్తున్నాం కావున, మనం అందరం స్వయం ప్రకాశితమైన మన ఆత్మజ్యోతి మీద మన మనస్సును ఏకాగ్రపరచాలి.
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో