YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వెయ్యికు గాను 670 పంచాయితీల్లో తాగు నీటి సమస్య

వెయ్యికు గాను 670 పంచాయితీల్లో తాగు నీటి సమస్య
అనంత’ భయంకరమైన కరువుతో అల్లాడిపోతోంది.జిల్లాలో 1,003 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 678 గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొంది. ఇందులో 357గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటడంతో తాగునీటి సమస్య మరింత జఠిలమైంది. ప్రస్తుతం 26 మీటర్లకు భూగర్భజల నీటిమట్టం పడిపోయింది. రాష్ట్రంలోని 13 జిల్లాలో ఈ స్థాయిలో నీటిమట్టం మరే జిల్లాలో పడిపోలేదు. జిల్లాలో 2.11లక్షల వ్యవసాయబోర్లు ఉన్నాయి. ఇందులో 87,574బోర్లు ఎండిపోయాయి. విధిలేని పరిస్థితుల్లో రైతులు పొలాల్లోని మోటర్లను ఇంటికి చేర్చారు. నీళ్లు లేక 10వేల హెక్టార్లలో మల్బరీ, 5వేల హెక్టార్లలో చీనీ, బొప్పాయి, అరటి లాంటి పండ్లతోటలు ఎండిపోయాయి. గ్రామాల్లో పశువులకూ తాగేందుకు నీరు కరువవుతోంది. పశువుల దప్పిక తీర్చేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని రైతులంతా ఏకమై ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి దప్పిక తీరుస్తున్నారు. జిల్లాలో 40.57లక్షల జనాభా ఉంది. ఇందులో 7.72లక్షల మేర జాబ్‌కార్డులు ఉండగా, 40 శాతం మందికి ఉపాధి పనులు కల్పిస్తున్నట్లు డ్వామా అధికారులు చెబుతున్నారు. ఒక్కో కుటుంబానికి 150రోజులు పని కల్పిస్తామంటున్నారు. అయితే జిల్లాలో 150రోజులు పనిదినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలు వందకు మించి లేవు. కుటుంబంలో నలుగురు ఉంటే 25 రోజుల్లో వీరికి కేటాయించిన ‘పని’ పూర్తి అయిపోతుంది. ఆపై ఉపాధి లభ్యం కాక వలసలు వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం 4.87లక్షల మంది వలసెళ్లినట్లు ఓ స్వచ్ఛందసంస్థ తన సర్వేలో వెల్లడించింది. ఉపాధి లేక రైతుకూలీలతో పాటు రైతులు కూడా వలసెళ్లుతున్నారు. కేరళలో కొందరు రైతులు భిక్షాటన చేస్తున్నారు. వాస్తవ పరిస్థితిని పక్కదారి పట్టిస్తూ అధిక డబ్బుల కోసం వలసెళుతున్నారంటూ మంత్రి అయ్యన్నపాత్రుడుతో పాటు జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, జిల్లా మంత్రులు వ్యాఖ్యానించారంటే ‘అనంత’ రైతులపై వీరికి ఎంత మేర బాధ్యత ఉందో ఇట్టే అర్థమైపోతోంది.ఎంతలా అంటే గత 19 ఏళ్లలో కనీవినీ ఎరుగుని రీతిలో కరువు కమ్మేసింది. వర్షపుచుక్కలేదు...పచ్చటి గడ్డిలేదు.. బోరులో నీటి చెమ్మలేదు...బతికేందుకు కూలిపని లేదు...మొత్తం మీద జిల్లాలో రైతులు...రైతు కూలీలు తినేందుకు ముద్ద లేదు. దీంతో పొట్టనింపుకునేందుకు లక్షలాదిమంది వలసబాట పట్టారు. ఇదిలాగే కొనసాగితే అనంత....ఆకలిచావులకు నిలయంగా మారే ప్రమాదం ఉంది.ఈ ఏడాది జిల్లాలో 15.15లక్షల హెక్టార్లలో వేరుశనగ, మరో 3–4లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగయ్యాయి. వేరుశనగ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తక్కిన పంటల్లో కూడా కంది, పత్తితో పాటు దాదాపు అన్ని పంటలదీ అదే పరిస్థితి. వరుసగా మూడేళ్లుగా పంట నష్టాలు చోటు చేసుకోవడంతో అన్నదాతలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. ఈ ఏడాది పరిస్థితి మరీ భయంకరంగా మారడంతో ‘వ్యవసాయం’ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుల ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైంది. పంట కోసం చేసిన అప్పులు తీర్చడం తలకు మించిన భారంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో పిల్లల పెళ్లిళ్లు వాయిదా వేసుకునేవాళ్లు, పిల్లల చదువుల ఫీజులు కట్టలేక మధ్యలోనే కళాశాలలు మాన్పించిన వారు. దీర్ఘకాలిక జబ్బులకు చికిత్స కూడా చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నవారు చాలామంది ఉన్నారు. వెరసి ఈ సమస్యలను అధిగమించలేక, అవమాన భారం తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు తెగుస్తున్నారు.

Related Posts