చిత్తూరు ఫిబ్రవరి 12,
చిత్తూరు జిల్లా పీలేరు ఎం జెఆర్ విద్యా సంస్థల అధినేత వెంకట్రమణా రెడ్డి అలియాస్ బాబురెడ్డి రైలు క్రింద పడి గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఇదిలావుంటే ఎంజెఆర్ విద్యా సంస్థ అప్పుల్లో కూరుకుపోయి కష్టాల్లో ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి విద్యా సంస్థలకు రావలసిన బకాయిలు రూ.కోట్లలో నిలిచి పోవడం,కరోనా కారణంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు కాకపోవడంతో,తెచ్చిన వారికి అప్పులు కట్టలేక అవమాన భారంతో ఆత్మహత్యకు దారి తీసినట్లు పీలేరులో చర్చించుకుంటున్నారు. వేల మంది విద్యార్థులను విద్యా వంతులుగా తీర్చిదిద్దిన ఎంజెఆర్ విద్యా సంస్థల అధినేత వెంకట్రమణా రెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం పలువురిని కలచివేస్తోంది.అయితే అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడా లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.