లాక్ డౌన్ కారణంగా ప్రయాణ సౌకర్యం పరిమితులు కారణంగా రోగుల సంఖ్య తగ్గిందని, కరోనా తగ్గుముఖం పట్టడంతో సుమారు 500 మంది రోగులు ఓపి సేవలు పొందుతున్నారని బర్డ్ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి తెలిపారు. బోన్ క్యాన్సర్ రోగులకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకు బోన్ బ్యాంక్ ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.3డి ప్రింటింగ్ టెక్నాలజితో కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయనున్నామని అన్నారు
తిరుపతి బర్డ్ ఆస్పత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసుపత్రి గౌరవ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కరోనా తగ్గు ముఖం పట్టడంతో రోజుకి 500 మంది రోగులు ఓపి సేవలు పొందుతున్నారని, మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు సుమారు 25 వరకు చేస్తున్నామని తెలియజేశారు. ఆరు నెలల నుండి ఏడాది నిరక్షణ కాలాన్ని ఇప్పుడు 48 గంటలకు కుదించామని స్పష్టంచేశారు. గతంలో చాలా అరుదుగా వెన్నెముక ఆపరేషన్లు ఇప్పుడు పార్శ్వ గూని సహా అన్ని రకాల వెన్నెముక ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బర్డ్ చరిత్రలో ఇదోక నూతన ఆధ్యాయమని సంతోషం వ్యక్తం చేశారు. బోన్ క్యాన్సర్ పేషంట్లకు మరింత ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తేవడానికి బోన్ బ్యాంక్ ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. గతంలో ప్రీ ఆనస్తీషియా పరీక్షల కోసం ఇతర ఆసుపత్రులకు పంపే పరిస్థితి ఉండేదిని అయితే ఇప్పుడు ఆసుపత్రిలోని లేబొరేటరీని ఆధునీకరించి ఫిజిషియన్, కార్డియాలజిస్ట్లను నియమించామని అన్నారు. మోకీలు, తుంటి మార్పిడి ఆపరేషన్లు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నపేదలకు ఉచితంగా చేసేందుకు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అంగీకరించారని ప్రకటించారు. మోకీలు మార్పిడి పరీక్షలకు కేవలం ఇంప్లాట్స్ ఖర్చులు మాత్రమే రోగి భరించాల్సి ఉంటుందని తెలిపారు. ఆపరేషన్ల వెయిటింగ్ లిస్ట్ను మరింతగా తగ్గించడానికి సకల సదుపాయాలతో కూడిన మరో మూడు ఆపరేషన్ థియేటర్లు త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు. కల్ ఆర్మ్ కోసం ఇప్పటికే 25 మంది పేర్లు నమోదు చేసుకున్నారని తెలియజేశారు.