YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గవర్నర్ సయోధ్య

గవర్నర్ సయోధ్య

విజయవాడ, ఫిబ్రవరి 13, 
ఒక తుఫాన్ వెలిసింది. ప్రశాంతత నెలకొంది. గత నెల రోజులుగా అటు వైపు ఇటు వైపు విమర్శలు, హాట్ హాట్ కామెంట్స్. మాట్లాడుకోవడానికి వీలు లేని తిట్లు, ఎత్తులు జిత్తులు, భారీ వ్యూహాలు ఇవన్నీ ఎందుకు అంటే ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ముందు జరిగిన అతి పెద్ద పంచాయతీ అన్న మాట. మొత్తానికి అత్యున్నత న్యాయ స్థానాలు కలుగచేసుకుని ఎన్నికలకు పచ్చ జెండా ఊపినా కూడా రచ్చ మాత్రం ఆగలేదు. ఇలా అటు ఎన్నికల సంఘం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అన్నట్లుగా సాగిన సమరం కాస్తా తొలి విడత పంచాయతీ ఎన్నికల తరువాత కాస్తా సద్దుమణిగినట్లుగానే సీన్ కనిపిస్తోంది.రెండూ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు. ఎవరి అధికారాలు వారికి ఉన్నాయి. అందువల్ల ఎవరినీ తక్కువ చేయాల్సిన అవసరం లేదు, దాంతో ఢీ అంటే ఢీ అంటున్న పరిస్థితి కనిపించి ఒక దశలో అసలు ఎన్నికలు జరుగుతాయా అన్న వాతావరణం కనిపించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతుంది. అయితే తాజాగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జోక్యం చేసుకుని రెండు వైపులా శాంతపరచారని ప్రచారం సాగుతోంది. గవర్నర్ తో భేటీ తరువాత తొలి విడత ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన నిమ్మగడ్డ ఆ తరువాత జరిగిన ఏకగ్రీవాలకూ ఓకే అనేశారు. దాంతో అటు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆయనకు అనూహ్యంగా సాయం లభించింది అంటున్నారు.ఈ మధ్య ఎన్నికల సంఘం తయారు చేసిన యాప్ ని హై కోర్టు నిలిపివేసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పెట్టిన ఎన్నికల సంఘం ఆంక్షలు కూడా కోర్టు ముందు నిలబడలేదు. దాంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా వరసగా ఎదురుదెబ్బలు తగిలాయని అంటున్నారు. ఇంకో వైపు ఎన్ని అధికారాలు రాజ్యాంగబద్ధంగా కల్పించినా కూడా ప్రభుత్వ సహకారం లేకుండా ఎన్నికలు నిర్వహణ కష్టమన్న అభిప్రాయం కూడా కలిగినట్లుంది అంటున్నారు. ఇంకో వైపు ప్రభుత్వం తన బ్రహ్మాస్త్రంగా సభా హక్కుల ఉల్లంఘనను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందుకు తేవడం వంటి పరిణామాలతో కూడా రెండు వైపులా తగ్గారని అంటున్నారు.నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో మాటలు తూలవద్దని, విమర్శలు చేయవద్దని ప్రభుత్వం నుంచే ఇపుడు చిత్రంగా మౌఖిక ఆదేశాలు మంత్రులకు ప్రభుత్వ పెద్దలకు వచ్చాయని ప్రచారం సాగుతోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల తరువాత మునిసిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా నిర్వహిస్తారని ప్రభుత్వానికి సమాచారం ఉంది. దాంతో ఆయనతో గొడవ పడడం కంటే సామరస్యంగా ఉండాలన్న తెలివిడితోనే వైసీపీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నార్. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైపు నుంచి కూడా ఏకగ్రీవాలకు అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో రెండు వైపులా ఇపుడు సయోధ్య పెరిగింది అంటున్నారు. మొత్తానికి నిమ్మగడ్డ హయాంలోనే అన్ని ఎన్నికలకు సిధ్ధం కావడానికి వైసీపీ పెద్దలు మానసికంగా రెడీ అయ్యారని టాక్. నిమ్మగడ్డ సైతం తన హయాంలో అన్ని ఎన్నికలను నిర్వహించి గౌరవప్రదంగామే పదవి నుంచి దిగిపోవాలనుకుంటున్నారుట. మొత్తానికి అదేదో సినిమాలో బ్రహ్మానందం క్యారక్టర్ అన్నట్లుగా వారూ వీరూ చుట్టాలైపోయారా అన్న చర్చ అయితే వస్తోంది.

Related Posts