YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

వానా కాలం సాగు ప్రణాళిక సిద్దం

వానా కాలం సాగు ప్రణాళిక సిద్దం

వానాకాలం సీజన్‌కు సంబంధించి సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు తయారు చేశారు. జిల్లాలో రైతులు ఎంత మేర విస్తీర్ణంలో ఏయే పంటలు సాగు చేసే అవకాశాలున్నాయి.. ఏ మేరకు విత్తనాలు, ఎరువులు అవసరమో ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించారు. బీటీ పత్తి విత్తనాలు ప్రభుత్వం సరఫరా చేయదు. ప్రైవేటు డీలర్లే సరఫరా చేయాల్సి ఉంటుంది. జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 65,905హెక్టార్లు ఉండగా.. గత ఏడాది 64,130.40హెక్టార్లలో సాగు చేశారు. ఈ ఏడాది 67,337హెక్టార్లలో సాగు చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. హెక్టారుకు 5ప్యాకెట్లు (ఎకరానికి రెండు ప్యాకెట్లు) అవసరం ఉండగా.. వాస్తవానికి 3,36,685 ప్యాకెట్లు అవసరమవుతున్నాయి. ఒక్కో బీటీ పత్తి విత్తన ప్యాకెటు 450గ్రాములుంటుంది. ఇక వర్షాలు సరిగా కురియక.. సకాలంలో మొలకలు రాని పరిస్థితుల్లో మళ్లీ విత్తనాలు వేయాల్సి ఉంటుంది. దీంతో జిల్లాలో 5,67,210 బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. గతంలో బీటీ పత్తి విత్తన ప్యాకెట్ ధర రూ.800 ఉండగా.. ఈ ఏడాది ప్రభుత్వం ప్యాకెట్‌పై రూ.60తగ్గించింది. దీంతో ప్రైవేటు డీలర్లు ఒక్కో ప్యాకెట్‌కు రూ.740కే విక్రయించనున్నారు. దీంతో జిల్లా రైతులకు ఆర్థికంగా భారం తగ్గింది.ఎరువులకు సంబంధించి.. జిల్లాకు ఈ వానాకాలంలో 81,860.21మెట్రిక్ టన్నులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 38,004.75మెట్రిక్ టన్నుల యూరియా, 19,002.38 మెట్రిక్ టన్నుల డీఏపీ, 15,201.90మెట్రిక్ టన్నుల ఎన్‌పీకే మిశ్రమ ఎరువులు, 9501.19మెట్రిక్ టన్నుల ఎంవోపీ (పోటాష్) ఎరువులు, 150మెట్రిక్ టన్నుల ఎస్‌ఎస్‌పీ (సూపర్) ఎరువులు అవసరమని అధికారులు నివేదిక సర్కారుకు పంపించారు. మండలాల వారీగా డీఏపీ, యూరియా, ఎన్‌పీకే మిశ్రమం, ఎంవోపీ, ఎస్‌ఎస్‌పీ ఎరువులు అవసరమనేది అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. గతంలో మండలానికి ఒక సెంటరులోనే ఎరువులు సరఫరా చేయగా.. ఇకపై రైతులపై భారం లేకుండా రెండు, మూడు గ్రామాలకు ఒక కేంద్రం పెట్టి వ్యవసాయ అధికారి, పీఏసీఎస్ కార్యదర్శి సమక్షంలో అందజేయనున్నారు. వీటితో పాటు మే 10నుంచి రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు, ఎకరానికి రూ.4వేల చొప్పున పెట్టుబడి సాయం కూడా పంపిణీ చేసేందుకు అధికారులు దృష్టి సారించారు.జిల్లాలో మొత్తం 1,52,019హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి పంట మినహా.. మిగతా పంటల సాధారణ సాగు విస్తీర్ణం 55,253హెక్టార్ల మేర ఉండగా.. 30311హెక్టార్లకు సర్కారు నుంచి రాయితీపై వివిధ రకాల విత్తనాలు అవసరం. వాస్తవానికి ఈ ఏడాది పత్తి మినహా.. మిగతా పంటలు 97,370హెక్టార్లలో సాగు చేసే అవకాశాలున్నాయి. దీంతో 53,566హెక్టార్లకు సర్కారు రాయితీపై వివిధ రకాల విత్తనాలు సరఫరా చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం 53,911క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేస్తున్నారు. సీడ్ విలేజ్ ప్రోగ్రాంలో భాగంగా రైతు నుంచి రైతుకు 935క్వింటాళ్లు, తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి 13,140క్వింటాళ్లు, సహకార సంఘాలు, ఇతర సంస్థల నుంచి 35,624 క్వింటాళ్లు, ప్రైవేటు డీలర్ల నుంచి 4212క్వింటాళ్లు సరఫరా చేసేందుకు ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే సర్కారుకు అధికారులు ప్రతిపాదనలు కూడా పంపించారు.

Related Posts