కరీంనగర్, ఫిబ్రవరి 15, కోట్లాది రూపాయల విలువ చేసే గోదావరి ఇసుకపై మాఫియా పెత్తనం కొనసాగుతున్నది. ఒకవైపు నిబంధనలకు విరుద్ధంగా యంత్రపరికరాలతో ఇసుక లోడింగ్ చేస్తున్న కాంట్రాక్టర్లు మరో వైపు నకిలీ వే బిల్లులతో అక్రమ రవాణా చేస్తున్నారు. జీరో వ్యాపారంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగాగండి పడుతుండగా కాంట్రాక్టర్లు మాత్రం తమ జేబులు నింపుకుంటున్నారు. నకిలీ వేబిల్లులతో వెళ్తున్న15 లారీలను జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇటీవల పట్టుకుని సీజ్ చేయటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇసుక మాఫియా వెనుక గులాబీ నేత హస్తం ఉండటంతో స్థానిక అధికారులు మౌనం దాల్చారనే విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయిభద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలో ఐదు ఇసుక రీచ్‌లను గిరిజన సహకార, సంఘాల ద్వారా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్నది. ఆన్‌లైన్‌లో వినియోగదారుల వద్ద నుంచి డబ్బు కట్టించుకుని తమ వద్ద నమోదు చేసుకున్న లారీల ద్వారా ఇసుక రవాణా చేయాల్సి ఉంది. వీటికి అవసరమైన వేబిల్లులను కూడా టీఎస్‌ఎండీసీ జారీ చేస్తుంది. కానీ జీరో దందాకు అలవాటు పడిన కాంట్రాక్టర్లు నకిలీ వేబిల్లులను సృష్టించుకుని ప్రయివేటు లారీల ద్వారా హైదరాబాద్‌కు గత కొంత కాలంగా అక్రమ రవాణా చేస్తున్నారు. హైదరాబాద్, ఏటూరునాగారం, మణుగూరు కేంద్రాలుగా కంప్యూటర్, ప్రింటర్ల సాయంతో కొందరు వ్యక్తుల సహకారంతో అక్రమ వేబిల్లులను తయారు చేయించి కాంట్రాక్టర్లు భారీగా లబ్ది పొందుతున్నారు. హైవేపై లారీలు పట్టుబడినప్పుడు కేవలం లారీ యజమానులపైన, డ్రైవర్లపైన కేసులు నమోదు చేయటం, అపరాథ రుసుము కట్టించుకుని సీజ్ చేసిన లారీలను వదలి వేయడం జరుగుతున్నది. నకిలీ వేబిల్లులతో రవాణా అవుతున్న ఇసుక ఏ రీచ్‌లో లోడ్ అవుతున్నదో పట్టుకుని ఆ రీచ్‌లను నిలిపివేయాల్సిన అధికారులు ఆ పని చేయక పోవటంతో కాంట్రాక్టర్లు తమ అక్రమాలను ఆపడం లేదు. నకిలీ వేబిల్లులను తయారు చేస్తున్న ముఠాను గత సంవత్సరం పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసినప్పటికీ వారిపై చార్జిషీట్ నమోదు చేయక పోవటంతో నకిలీ వేబిల్లుల వ్యవహారం కొనసాగుతూనే ఉంది. నకిలీ వేబిల్లులతో రవాణా చేస్తున్న లారీలను టీఎస్‌ఎండీసీ రీచ్‌లలో లోడింగ్ చేయడం కూడా వివాదాస్పదమైంది. ఈ రీచ్‌ల వద్ద సంస్థ అధికారిక వేబిల్లులను తనిఖీ చేయాల్సిన సంస్థ సిబ్బంది కూడా అక్రమార్కులతో చేతులు కలపడంతోటే ఇది సాధ్యమవుతున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల పట్టుబడిన లారీలు తమ రీచ్‌ల వద్ద లోడ్ కాలదని తప్పించుకోవడానికి కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే వీటి విషయంలో పోలీసులు ఇప్పటికే కీలకమైన సమాచారం సేకరించారు. పట్టుబడిన లారీలు మణుగూరు మండలంలోని మూడు ఇసుక రీచ్‌లలో ఇసుక నింపుకున్నట్టు వారు ప్రాథమిక ఆధారాలుసేకరించారు.గోదావరి నదిలో మంజూరు సహకార సంఘాల ఇసుక రీచ్‌లలో యంత్రపరికరాలతో కాకుండా మనుషులతో (మాన్యువల్) ట్రాక్టర్లు నింపి ఒడ్డుమీద పోసిన తర్వాత లారీలను యంత్రాలతో లోడ్ చేసుకోవాలని పర్యావరణ నిబంధనల్లో పేర్కొన్నారు. దీనిని కాంట్రాక్టర్లు పూర్తిగా పెడచెవిన పెట్టి నేరుగా నదిలోనే భారీ లారీలను యంత్రాలతో లోడింగ్ చేస్తున్నారు. ఫలితంగా ఆదివాసీలు ఆదాయాన్ని కోల్పోతున్నారు. రహదారిపై తనిఖీలు జరిగే సమయంలో కూడా ముందుగానే మాఫియా కు సమాచారం అందడంతో వారు లారీలను మార్గమధ్యంలోనే నిలిపి వేస్తున్నారు. నకిలీ వేబిల్లుల లారీలు వెళ్లే దారిలో ముందుగానే ఒక ఎస్కార్ట్ వాహనాన్ని కూడా అక్రమార్కులు ఏర్పాటు చేసు కుంటున్నారు. తనిఖీలు ఎక్కడైనా జరుగుతుంటే మొబైల్ ఫోన్‌లలో లారీల డ్రైవర్లకు సమాచారం అందిస్తున్నారు.మణుగూరు ప్రాంతంలో నకిలీ వేబిల్లులతో ఇసుక రవాణా చేస్తున్న కొందరు కాంట్రాక్టర్లకు అధికార పార్టీ నేత అండదండలు ఉండటంతో వారిపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు కూడావెనుకడుగు వేస్తున్నారని తెలిసింది. జిల్లా స్థాయి అధికారులు చర్యలకు ఉపక్రమించి నప్పుడు ఆ నాయకుడి వద్ద నుంచి ఫోన్‌లు వస్తున్నాయని ఒక అధికారి తెలిపారు. ఇసుక లారీలు అటవీ, రవాణా శాఖల చెక్‌పోస్ట్‌లను దాటి వెళ్తున్నప్పటికీ ప్రతి లారీ వద్ద కొంత మొత్తాన్ని చెక్‌పోస్ట్‌ల వద్ద వసూలు చేసి విడిచి పెట్టడం విశేషం. లాభంలో సగం వాటా అధికార పార్టీ నేతకు ఇస్తేనే రీచ్ నిర్వహణకు అంగీకరిస్తున్నారనీ, లేక పోతే చేయవద్దని హుకుం జారీ చేస్తున్నారని కాంట్రాక్టర్లు వాపోతున్నా