
హైదరాబాద్ , ఫిబ్రవరి 15, పాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. దీనిపై ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శిస్తున్నదని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. 2017, జులై 23న చివరిసారిగా రాష్ట్రంలో టెట్ రాతపరీక్షలు జరిగాయి. మూడేండ్లుగా (43 నెలలు) టెట్ నోటిఫికేషన్ కోసం సుమారు 4 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం పడదు. పరీక్ష ఫీజు వల్ల ప్రభుత్వానికే కొంత ఆదాయం వస్తుంది. అయినా టెట్ నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. అయితే ఉపాధ్యాయ ఖాళీల భర్తీపైనే రాష్ట్ర ప్రభుత్వం విముఖత ప్రదర్శిస్తున్నది. 8,972 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 2017, అక్టోబర్‌లో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) ప్రకటించింది. ఆ నియామకాలే ఇంకా పూర్తి కాలేదు. కొన్ని పోస్టులు ఇంకా భర్తీ చేయాల్సి ఉన్నది. ఇంకోవైపు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టడం లేదు. అన్ని శాఖల్లోని ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ విద్యాశాఖలో మాత్రం పదోన్నతులు ఇవ్వడం లేదు. ఖాళీలు ఏర్పడతాయనే పదోన్నతులను చేపట్టడం లేదని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆ ఖాళీల భర్తీకి టీఆర్టీ ప్రకటించాలని ప్రభుత్వంపై అభ్యర్థుల నుంచి ఒత్తిడి పెరుగుతుందనే టెట్‌ను నిర్వహించకుండా వాయిదా వేస్తున్నట్టు తెలుస్తున్నది.త్వరలోనే 50 వేల కొలువులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు గతంలో ప్రకటించారు. దీంతో ఉపాధ్యాయ కొలువులు 12 వేలకుపైగా ఉంటాయనీ, గురుకులాల్లోనూ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అవుతాయని అంతా భావించారు. టెట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సమాలోచన చేసింది. కోవిడ్ నేపథ్యంలో టెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని భావించింది. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదు. అయితే డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు లక్షలాది మంది ఇప్పటికే కోచింగ్ బాట పట్టారు. టెట్ నోటిఫికేషన్ జారీ చేయకుండా అభ్యర్థుల ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. 2017, జులై 23 తర్వాత నిర్వహిస్తున్న టెట్‌లో ఎలాగైనా ఎక్కువ స్కోర్ సాధించాలని పట్టుదలతో ఉన్నారు. వేలాది మంది ఏపీలోని అవనిగడ్డ, కర్నూల్‌లోని కోచింగ్ కేంద్రాలకూ వెళ్లారు. కోచింగ్ ఫీజు, హాస్టల్, భోజనం, ఇతర ఖర్చుల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల్లో నిరుత్సాహం కనిపిస్తున్నది. ఎన్నికల కోడ్ టెట్ నిర్వహణకు అడ్డంకి కాదని అభ్యర్థులు వాపోతున్నారు. ఎందుకంటే ఇది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు కాదనీ, కేవలం అర్హత పరీక్ష మాత్రమేనని చెప్తున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతితో టెట్ నిర్వహించొచ్చని అభిప్రాయపడుతున్నారు.టెట్‌లో అనేక మార్పులు జరిగే అవకాశమున్నది. నూతన విద్యావిధానం అమల్లో భాగంగా టెట్‌లో మార్పులు చేసేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) చర్యలు తీసుకుంటున్నది. పూర్వ ప్రాథమిక స్థాయి (ప్రీప్రైమరీ) నుంచి 12వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు, అధ్యాపకులకు టెట్ వర్తింపచేయాలని ఎన్‌సీటీఈ నిర్ణయించింది. ఆయా తరగతులకు బోధించే వారంతా ముందు టెట్‌లో అర్హత సంపాదించాలి. ఆ తర్వాతే ఉపాధ్యాయ, అధ్యాపక నియామక పరీక్షలకు అర్హులవుతారు. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఎన్‌సీటీఈ ఒక కమిటీని నియమించింది. ఈనెల 15లోగా అభిప్రాయాలు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందో తెలియాల్సి ఉన్నది. ఇంకోవైపు భవిష్యత్తులో టెట్ అర్హత సంపాదిస్తే అది జీవిత కాలమంతా ఉంటుందని ఎన్‌సీటీఈ ప్రకటించింది. ప్రస్తుతం టెట్ అర్హత ఏడేండ్ల వరకే కాలపరిమితి ఉన్నది. ఈ మేరకు టెట్ నిబంధనలను ఎన్‌సీటీఈ సవరించింది. దీనిపైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ఈ మార్పులు జరిగినా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఆ నిర్ణయాలు తర్వాతైనా వర్తింపచేయొచ్చని అభ్యర్థులు చెప్తున్నారు.టెట్ నోటిఫికేషన్‌కు ఎన్నికల కోడ్ వర్తించదు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు వరుసగా ఉంటాయి. అంటే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారు. వెంటనే టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలి. 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఉపాధ్యాయ అభ్యర్థులు కోచింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు