రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నాం. ప్రతిపక్ష వైకాపా స్వార్ధ ప్రయోజనాల కోసం పాకులాడుతోంది. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు తిరగబడేంత వరకు వైకాపా ఏం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం నాడు అయన గూడూరులో మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లు నిద్రపోయి ఇప్పుడు డ్రామా చేస్తున్నారు. ప్రధాని మోదీని బాలకృష్ణ విమర్శించారని రాద్ధాంతం చేస్తున్నారు .చంద్రబాబు గారిని విజయసాయి రెడ్డి నోటికొచ్చినట్టు ఘోరమైన భాషతో మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నారని నిలదీసారు. వైకాపా, బీజేపీ లాలూచీ రాజకీయంతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. ఆ రెండు పార్టీల మధ్య అక్రమ ఒప్పందం ఉందని అయన ఆరో్పించారు. మిత్రపక్ష పార్టీ సీఎం అయిన చంద్రబాబు గారికి అపాయింట్ మెంట్ ఇవ్వని మోదీ 12 కేసుల్లో ముద్దాయి అయిన జగన్ కు 45 నిమిషాలు అవకాశం ఇవ్వడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని అడిగారు. బీజేపీని నిలదీసే దమ్ములేని వైకాపా నేతలకు మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైల్వే జోన్, లోటు బడ్జెట్ తదితర రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో ఆఖరు బడ్జెట్ వరకు పోరాడం. రాష్ట్రానికి అన్యాయం జరగడంతో దేశాన్ని పాలించే అధికారాన్ని వదులుకుని చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నామని మంత్రి అన్నారు.