YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

చిన్నమ్మ వర్సెస్ అన్నాడీఎంకే

చిన్నమ్మ వర్సెస్ అన్నాడీఎంకే

చెన్నై, ఫిబ్రవరి 16, 
తమిళనాడులో జయలలిత ఇమేజ్ వేరు. అమ్మగా అందరూ పిలుచుకునే జయలలిత మరణం అన్నాడీఎంకే ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. వరసగా రెండు సార్లు పార్టీని అధికారంలోకి తేవడంలో జయలలిత ఇమేజ్ మాత్రమే పనిచేసిందన్నది వాస్తవం. అయితే ఈసారి జయలలిత లేరు. అన్నాడీఎంకే అనాధగా మారింది. నాయకత్వం లేమి కన్పిస్తుంది. అమ్మ మరణం తో వెల్లువెత్తిన సానుభూతి ఈసారి కూడా తమకు ఓట్ల వర్షం కురిపిస్తుందని అన్నాడీఎంకే అంచనా వేస్తుంది.2016లో జయలలిత మరణించారు. ఆమె మరణం కూడా మిస్టరీగానే మారింది. ఇప్పటి వరకూ ఆమె మరణంపై ఏర్పాటుచేసిన కమిషన్ కూడా ఏ విషయమూ తేల్చలేదు. జయలలితపై విషప్రయోగం జరిగిందన్న ప్రచారమూ అప్పట్లో సంచలనం సృష్టించింది. దీనికి శశికళ కారణమంటూ తాజాగా సోషల్ మీడియాలో అన్నాడీఎంకే వర్గాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇందుకు ఆధారాలు లేకపోయినా ఎన్నికల వేళ ఇది హాట్ టాపిక్ గా మారింది.శశికళ జైలు నుంచి బయటకు వస్తుండటం, అన్నాడీఎంకేను తాను స్వాధీన పర్చుకోవాలని ప్రయత్నిస్తుండటంతో పళని, పన్నీర్ వర్గం నేతలు ఈతరహా ప్రచారం మొదలుపెట్టారంటున్నారు. ప్రజల్లో శశికళపై వ్యతిరేకతను పెంచడమే ప్రధాన ఉద్దేశ్యం. అమ్మ ఆస్తులను కూడా శశికళ వర్గం స్వాధీనంచేసుకుందన్న విమర్శలుకూడా అధికార పార్టీ ప్రారంభించింది. శశికళకు వాయిస్ లేకుండా చేయడమే లక్ష్యంగా అన్నాడీఎంకే నేతలు విమర్శల దాడిని మొదలుపెట్టారు.నిజానికి ప్రతిపక్ష డీఎంకే కంటే ఇప్పుడు శశికళను నిలువరించడమే అన్నాడీఎంకే నేతల ముందున్న సవాల్. అందుకే జయలలిత స్మారక మందిరానికి హడావుడిగా ప్రారంభించారు. జయలలిత మరణించిన తర్వాత ఆమె పేరట జరిగిన అతిపెద్ద కార్యక్రమం ఇదేనని చెప్పాలి. ఇటు జయలలిత మరణం సానుభూతిని మరోసారి తెప్పించడం, శశికళపై వ్యతిరేకతను ఏర్పరచడమే అన్నాడీఎంకే లక్ష్యంగా కన్పిస్తుంది. ఇప్పుడు పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు డీఎంకే, శశికళను ఎదుర్కొనాల్సి ఉంది.

Related Posts