2004లో అలిపిరి ఘటన కనిపించిందని, 2019లోనూ అదే రిపీట్ అవుతుందని బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తుండగా, ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నిప్పులు చెరిగారు. మిమ్మల్ని ప్రశ్నిస్తే చంపేస్తారా? బెదిరింపులకు దిగుతారా? అంటూ మండిపడ్డారు. మంగళవారం కర్నూలులో విలేకరులతో మాట్లాడిన కేఈ, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటే, వారిపై బీజేపీ బెదిరింపులకు పాల్పడడం సరికాదన్నారు. అణగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. మోదీ అంటే 'మాస్టర్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ఇండియా' అని కొత్త అర్థం చెప్పారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బీజేపీకి జగన్, పవన్ సహాయం చేయడం దురదృష్టకరమని అన్నారు. వైసీపీ, బీజేపీ కలసి చేస్తున్న కుట్రలో పవన్ ఓ పావుగా మిగిలిపోయారని అభిప్రాయపడ్డ ఆయన, తనపై ఉన్న కేసుల నుంచి బయట పడేందుకు నిత్యమూ జగన్, మోదీ భజన చేస్తున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు దీక్ష చేసిన రోజునే, తన రహస్య అజెండాతో పవన్ హడావుడి చేశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు దీక్ష రోజు పవన్ కల్యాణ్ చేసిన హడావుడి వెనుక రహస్య అజెండా ఏంటో రాష్ట్ర ప్రజలకు అర్థమైందని కృష్ణమూర్తి పేర్కొన్నారు.