ఏపీలో మారిన రాజకీయ పరిస్థితులు, ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్, కడపలో ఉక్కు కర్మాగారం వంటి విభజన హామీల అమలుకు ప్రజల్లో పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో, బీజేపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు కష్టమేనని భావిస్తున్న పలువురు రాష్ట్ర నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.రేపు జగన్ సమక్షంలో బీజేపీలో చేరేందుకు కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయించుకోగా, ఆయన దారిలో కావూరి సాంబశివరావు, కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి కూడా పయనించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ నెల 29న జగన్ పాదయాత్రలో భాగంగా గుడివాడలో వైసీపీ కండువా వేసుకోనున్నారు. పాణ్యం నియోజకవర్గం నుంచి ఐదు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలిచిన కాటసాని2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. 60వేలకు పైగా ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఎన్నికల అనంతరం కాటసాని కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. రాష్ట్ర నాయకుడుగా ఆ పార్టీలో చురుకైన పాత్రను పోషించారు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో బీజేపీని వీడాలనే ఆలోచనకు వచ్చారు. కార్యకర్తల సూచనల మేరకు వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు ఆయన అనుచరులు అంటున్నారు. ఈ మేరకు గుడివాడలో జగన్ పాదయాత్రలో ఆయన సమక్షంలోనే వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి కర్నూలు నగరం, పాణ్యం, ఓర్వకల్లు, గడివేముల మండలాల నుంచి భారీ సంఖ్యలో నాయకులతో వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన కార్యకర్తల సమావేశంలో రాబోయే ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గం నుంచే బరిలో ఉంటానని కాటసాని స్పష్టం చేశారు. అయితే.. ఈ నియోజకవర్గానికి గౌరు చరిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాటసాని వైసీపీలో చేరితే గౌరును కాదని ఆయనకు వైసీపీ టికెట్ ఇస్తారా..అనేది ఆ పార్టీలో ప్రధాన చర్చగా మారింది. కాటసాని ఈనెల 29న వైసీపీలో చేరుతారని తెలుస్తుండగా, కావూరి చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. ఈలోగానే అంటే 27వ తేదీన జగన్ సమక్షంలో మరో నేత వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీలో చేరనున్నారన్న విషయం తెలిసిందే.