YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మరో ప్లాన్ లో యడ్డీ

మరో ప్లాన్ లో యడ్డీ

బెంగళూర్, ఫిబ్రవరి 17, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అసమ్మతి పోరు తప్పడం లేదు. ఆయన కుదురుకుంటున్నానుకున్న సమయంలో మళ్లీ అసంతృప్తి తలెత్తుతుండటం విశేషం. మంత్రి వర్గ విస్తరణ తర్వాత అసమ్మతి చల్లారుతుందని భావించిన యడ్యూరప్పకు మళ్లీ షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అసమ్మతి నేతలు ఉగాది తర్వాత యడ్యూరప్ప దిగిపోతారంటూ బహిరంగ ప్రకటనలు చేస్తుండటం ఆయనకు మింగుడుపడటం లేదు.ఉగాది తర్వాత ఉత్తర కర్ణాటక నాయకుడు ముఖ్యమంత్రి అవుతారని బసనగౌడ పాటిల్ యత్నాళ్ చేసిన వ్యాఖ్యలు యడ్యూరప్ప శిబిరంలో కలకలం రేపుతున్నాయి. దీనికి తోడు యడ్యూరప్ప ఏర్పాటు చేసిన విందు సమావేశానికి దాదాపు 35 మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరుకావడం కూడా పరిస్థితికి అద్దం పడుతుంది. దీంతో ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు అసమ్మతి శిబిరంలో ఉన్నారన్నది చెప్పకనే తెలుస్తోంది. దీంతో యడ్యూరప్ప దిద్దుబాటు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.యడ్యూరప్ప అసమ్మతిని అణిచి వేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. హైకమాండ్ ను ఒప్పించి మరీ మంత్రివర్గ విస్తరణను ఇటీవల చేపట్టారు. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను అప్ప అందలం ఎక్కిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అసమ్మతి నేతలు ప్రత్యేక శిబిరంగా ఏర్పాటయి సమావేశాలను ఏర్పాటు చేస్తూ యడ్యూరప్పకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.దీంతో యడ్యూరప్ప మరోసారి మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికలకు సన్నద్ధమవ్వడానికి కేబినెట్ లో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో ఉన్న వారిని కొందరిని తప్పించి పార్టీ పదవులు, బాధ్యతలు ఇవ్వాలన్నది యడ్యూరప్ప యోచనగా ఉంది. దీంతో అసమ్మతికి చెక్ పెట్టాలన్నది యడ్యూరప్ప వ్యూహంగా ఉంది. మరి యడ్యూరప్ప ఎలాంటి వ్యూహాలు వేసినా అసమ్మతి మాత్రం నిత్యం ఉంటుందన్నది పార్టీ నేతల అభిప్రాయం. మొత్తం మీద యడ్యూరప్ప ముఖ్యమంత్రి చేపట్టిన నాటి నుంచి ఆయనకు అసమ్మతి నుంచి బయటపడలేకపోతున్నారు.

Related Posts