YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కమలానికి దూరం అవుతున్నారా

కమలానికి దూరం అవుతున్నారా

విజయవాడ, ఫిబ్రవరి 18, 
ఏపీలో బీజేపీతో ఏడాదిగా సావాసం చేస్తున్న జనసేనాని తొలిసారిగా బాహాటంగా ఆ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. బీజేపీ పెద్దలు ఢిల్లీలో కూర్చుని తీసుకున్న అతి ప్రియమైన నిర్ణయాన్ని మిత్ర పక్షంగా ఉన్న జనసేన ఏపీలో గట్టిగా వ్యతిరేకించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తే తాము చూస్తూ ఊరుకోమని కూడా పవన్ కల్యాణ్ గర్జించారు. ఇపుడు బీజేపీకి ఇది మింగుడుపడని వ్యవహారమే. తమ వెన్నటి ఉన్న మిత్రుడే సహించలేని నిర్ణయాన్ని జనాలకు ఎలా సర్ది చెబుతారు అన్నదే వారి ముందున్న ప్రశ్న.నిజానికి పవన్ కళ్యాణ్ సరైన సమయం కోసం చూస్తున్నారని ప్రచారం కూడా ఉంది. ఏపీలో బీజేపీ తాను ఎత్తిగిల్లదు, పక్కన ఉన్న మిత్ర పార్టీని కూడా ఎత్తిగిల్లనివ్వకుండా గిల్లుతుంది. దాంతో పవనే కాదు జనసైనికులు చాలాకాలంగా మండుతున్నారు. ఒంటెద్దు పోకడలతో పెద్దన్న వైఖరితో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుకు పవన్ కల్యాణ్ విసిగిపోయారని కూడా ప్రచారంలో ఉంది. తిరుపతి ఉప ఎన్నిక కానీ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలు కానీ బీజేపీ తన పై చేయి చాటుకోవడానికే తాపత్రయపడడాన్ని కూడా పవన్ కల్యాణ్ గ్రహిస్తున్నారు అంటున్నారు. ఇక వరసగా పెడుతున్న కేంద్ర బడ్జెట్లలో ఏపీకి వెన్ను పోటు తప్ప ఒక్క పైసా కూడా రాలని సంగతిని కూడా ఆయన అర్ధం చేసుకున్నారని చెబుతున్నారు. దాంతో ఇపుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంతో పవన్ అలా బయటపడ్డారని కూడా తెలుస్తోంది.బీజేపీ వల్ల పొలిటికల్ గా వర్కౌట్ కాదని జనసేన ఇప్పటికే ఆలోచనలో ఉందని అంటున్నారు. అయితే ఉన్నఫళంగా బంధాన్ని బద్ధలు కొడితే పవన్ కల్యాణ్ రాజకీయ చపలచిత్త వైఖరి మీద బీజేపీ నుంచి ఘటు విమర్శలు వస్తాయని ఆగుతున్నారని అంటున్నారు. ఇపుడు అతి పెద్ద ప్రజా సమస్యగా విశాఖ స్టీల్ ప్లాంట్ అవతరించింది. దాంతో పాటే ఏపీకి ఏ విధంగానూ బీజేపీ మేలు చేయడంలేదని బాణాలు వేస్తూ కూటమిని బీటలు వార్చేలా జనసేన ఒక కఠిన నిర్ణయమే తీసుకుంటుంది అని చెబుతున్నారు. ఏపీలో చూస్తే బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వస్తే జనసేనకు ఆరు శాతం ఓట్లు వచ్చాయి. ఒక విధంగా ఇది మంచి నంబరే అని కూడా అంటున్నారు.పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాపు నేతలతో భేటీ వేయడం వెనక కూడా కచ్చితమైన వ్యూహం ఉందని అంటున్నారు. తనంతట తానుగా ఏపీలో బలపడడానికి కాపుల స్టాండ్ తీసుకోవాలని కూడా పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది. అదే సమయంలో ఏపీలో వైసీపీ, టీడీపీలకు ధీటుగా కాపుల ఓట్లతో అతి పెద్ద రాజకీయ పార్టీగా నిలబడడానికి జనసేన ఎత్తులు వేస్తోందని అంటున్నారు. ఈ సమయంలో కేంద్రంలో ఉంటూ కూడా ఏపీకి తీరని అన్యాయం చేస్తున్న బీజేపీతో ఉండడం వల్ల మాట పడడం, వారు చేసే తప్పులకు సంజాయిషీలు ఇచ్చుకోవడం తప్ప ఒరిగేది ఏదీ లేదని కూడా జన‌సేనలో ఒక వాదన వినిపిస్తోందిట. దాంతో పవన్ కల్యాణ్ సాధ్యమైనంత త్వరలో కమలం చెర నుంచి బయటపడి స్వేచ్చా జీవి అవుతారు అంటున్నారు.

Related Posts