నల్గొండ, ఫిబ్రవరి 18,
రాష్ట్రంలోని కొత్త మున్సిపాలిటీల్లో బార్ల ఏర్పాటుకు మస్తు అప్లికేషన్లు వచ్చాయి. 159 కొత్త బార్లను ఏర్పాటు చేస్తామని సర్కార్ ప్రకటించగా, దరఖాస్తులు వెల్లువెత్తాయి. మంగళవారం ఒక్కరోజే 798 అప్లికేషన్లు రాగా.. మొత్తంగా 8,464 అప్లికేషన్లు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష నాన్ రిఫండబుల్ ఫీజు కావడంతో.. సర్కారుకు అప్లికేషన్ల ద్వారా రూ.84.64 కోట్ల ఆదాయం వచ్చింది. వాస్తవానికి ఈ నెల 8కే అప్లికేషన్ గడువు ముగియగా, మరింత ఆదాయం రాబట్టుకునేందుకు సర్కార్ గడువును 16 వరకు పొడిగించింది. ఈ నెల 18న జిల్లాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో, 19న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్సైజ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 1,052 బార్లు ఉండగా.. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 159 బార్లను ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. వీటితో కలిపి మొత్తం బార్లు 1,211కు చేరనున్నాయి. లిక్కర్ సేల్స్ లైసెన్సు ఉన్న క్లబ్‌లు మరో 28, రిసార్టులు 6 ఉన్నాయి.గ్రేటర్ పరిధిలో 55 బార్లకు 1,338 దరఖాస్తులు వచ్చాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ఒక్క బార్ నోటిఫై చేయగా, అత్యధికంగా 317 అప్లికేషన్లు వచ్చాయి. ఇక్కడ పోటీ ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో మొత్తం 5 బార్లు ఏర్పాటు చేస్తుండగా, 700 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో 3 బార్లకు గాను 9, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 7 బార్లకు గాను 23 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి.