YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ప్రైవేట్ టీచర్ల కష్టాలు ఇంతింతకాదయా

ప్రైవేట్ టీచర్ల కష్టాలు ఇంతింతకాదయా

హైదరాబాద్, ఫిబ్రవరి 18, 
రాష్ట్రంలో ప్రైవేటు స్కూల్ టీచర్ల పరిస్థితి దారుణంగా మారింది. దాదాపు ఏడాదిగా జీతాల్లేక, ఎట్లా బతకాల్నో తెలియక సుమారు రెండు లక్షల మంది టీచర్లు ఆగమైతున్నరు. ఇల్లు కిరాయికి, ఈఎంఐలకు, అసలు నిత్యావసరాలకే డబ్బుల్లేక.. దొరికిన కాడ అప్పులు చేస్తున్నరు. చివరికి ఇంట్లో ఉన్న అంతో ఇంతో బంగారాన్ని కూడా అమ్ముకుని బతుకు వెళ్లదీస్తున్నరు. పొలాలు, జాగలు అమ్ముకుంటున్నవారు కొందరైతే.. ఈఎంఐలు కట్టలేక బైకులు కూడా అమ్మేసుకుంటున్నవారు ఇంకొందరు.. దాదాపు 80 శాతానికిపైగా ప్రైవేటు టీచర్లది ఇదే దుస్థితి. కొందరు టీచర్లు చాయ్ దుకాణాలు, కూరగాయల షాపులు పెట్టుకుంటుంటే.. మరికొందరు దొరికిన ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేరి గడుపుతున్నరు. ‘భారత్ దేఖో’ అనే యూత్ ఆర్గనైజేషన్ ఇటీవల ‘బడ్జెట్ (చిన్న స్థాయి) ప్రైవేట్ స్కూళ్ల’లో పనిచేస్తున్న టీచర్ల పరిస్థితులపై చేసిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.బడ్జెట్ స్కూల్స్ టీచర్ల పరిస్థితి రోజురోజుకు దీనంగా మారిపోతోంది. కిరాయి ఇండ్లలో ఉంటున్నవారు, ఉద్యోగాలను నమ్ముకుని బైక్‌, టీవీ వంటివి కొనుక్కున్నవారు తీవ్రంగా ఇబ్బందులు పడ్తున్నారు. రెంటు కట్టలేక, ఈఎంఐలు చెల్లించలేక అవస్థ పడుతున్నారు. కొందరు ల్యాప్‌ టాప్‌లు, బైకులు అమ్ముకొని ఖర్చులు వెళ్లదీస్తున్నారు. బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు గత ఏడాది జనవరి, ఫిబ్రవరి నుంచే జీతాల్లేవు. మార్చిలో లాక్ డౌన్ వచ్చేసింది. దాంతో అప్పటివరకు రావాల్సిన జీతాలను కూడా మేనేజ్‌మెంట్లు చెల్లించలేదు.మొత్తం ఏడాది నుంచి ఒక్క రూపాయి జీతం రాక దయనీయమైన జీవితం గడుపుతున్నామని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ తో దాదాపు 90 శాతం మంది ప్రైవేట్ టీచర్లు ఉద్యోగాలు కోల్పోయి ఖాళీగా ఉంటున్నారు. ఇందులో సగానికి పైగా కిరాయి ఇండ్లలో ఉంటున్న వారే. భార్యభర్త ఇద్దరు టీచర్లుగా పనిచేస్తున్నవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అలాంటి ఫ్యామిలీల్లో ఇద్దరికీ జీతాల్లేక విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లలో రెండున్నర లక్షల మంది ప్రైవేట్ టీచర్లు పనిచేస్తున్నారు. ఇందులో దాదాపు రెండు లక్షల మంది టీచర్లు లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నాలుగు వేలకుపైగా బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లు ఉండగా.. అందులో 70 వేల మంది టీచర్లున్నారు. ఇప్పుడు వీరిలో 50 వేల మంది దాకా ఖాళీగా ఉండగా.. మరో 20 వేలమంది టీచర్లు నైన్త్, టెన్త్ క్లాసులకు పాఠాలు చెప్తున్నారు. స్కూళ్ల మేనేజ్మెంట్లు ఈ 20 వేల మందికి కూడా సగం జీతాలు, హవర్లీ బేస్డ్ జీతాలిస్తూ పని చేయించుకుంటున్నాయి. స్కూళ్లు రీఓపెన్ అయినా కూడా చాలా మేనేజ్మెంట్లు టీచర్లకు పూర్తి జీతాలు ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల రోజంతా పని చేయించుకుని కూడా సగం జీతం మాత్రమే ఇస్తున్నారు. ప్రస్తుతం మొత్తం టీచర్లలో 10 శాతం మంది కూడా ఫుల్ శాలరీలు తీసుకోవడం లేదంటే.. వాళ్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఎక్స్పర్టులు స్పష్టం చేస్తున్నారు.హైదరాబాద్ సిటీకి చెందిన ‘భారత్ దేఖో’అనే యూత్ ఆర్గనైజేషన్ నవంబర్ నుంచి జనవరి వరకు సిటీలోని 30 బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్ల టీచర్లతో ఆన్‌‌లైన్‌‌ సర్వే కండక్ట్ చేసింది. ‘లాక్‌‌ డౌన్‌‌లో ప్రైవేటు టీచర్లు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ప్రస్తుతం వారి ఫైనాన్షియల్ పరిస్థితి ఎలా ఉంది, ఏం చేస్తున్నారు’అన్న అంశాలపై సర్వే చేపట్టింది. ఇందులో 220 మంది ప్రైవేట్ స్కూల్ టీచర్లు పాల్గొన్నారు. ఇందులో 78.6 శాతం మంది ఫిమేల్, 21.4 శాతం మేల్ టీచర్లున్నారు. సర్వేలో వారంతా తమ దుస్థితిని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు టీచర్లందరి పరిస్థితి ఇలాగే ఉందని చెప్పారు. లాక్‌‌ డౌన్‌‌లో 85.7 శాతం మంది టీచర్లకు ఎలాంటి ఇన్‌‌ కమ్‌‌ లేదని.. పూర్తిగా జీరో ఇన్‌‌ కంతో జీవితాలు వెళ్లదీశారని సర్వే గుర్తించింది. కేవలం 14.3 శాతం మంది టీచర్లకు మాత్రమే కొంతవరకు ఇన్‌‌కం లభించిందని.. అది కూడా వారు ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారని తేలింది.సర్వే రిపోర్టు ప్రకారం.. అన్‌‌లాక్‌‌ తర్వాత స్కూళ్లు తెరిచినా 62 శాతం మంది టీచర్లకు ఉద్యోగాలు లేని పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక 50 శాతం మంది టీచర్లు చుట్టాలు, తెలిసినవాళ్ల దగ్గర కనీసం 30 వేలకుపైగా అప్పులు చేశారు. కొందరు పెద్ద మొత్తంలో అప్పులు చేయాల్సి వచ్చింది. బడ్జెట్‌‌ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లలో 64.3 శాతం మంది అద్దె ఇండ్లల్లో ఉంటున్నారు. వారిలో 90 శాతం మంది టీచర్లు కనీసం ఐదారు నెలల రెంట్‌‌ బాకీ పడ్డారు. వీరిలో చాలా మంది టీచర్లు నిత్యావసరాలు కూడా కొనుక్కోలేని దుస్థితిలో ఉన్నారు. 76 శాతం మంది ఇప్పటికిప్పుడు తమకు ఏ ఉద్యోగం దొరికినా చేసేందుకు రెడీగా ఉన్నారు. గతంలో కన్నా తక్కువ జీతం వచ్చినా పరవాలేదని అంటున్నారు. ఇక 81 శాతం మంది టీచర్లకు ఎలాంటి హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ లేదు. ఏదైనా అనారోగ్యానికి గురైతే సర్కారీ దవాఖానాలే దిక్కు అన్న పరిస్థితిలో ఉన్నారు. ఆర్గనైజేషన్ మెంబర్లు ఈ సర్వేలో పాల్గొన్న టీచర్లలో ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి.. అరగంట పాటు మాట్లాడి, పరిస్థితి తెలుసుకున్నారు. బాధల్లో ఉన్న టీచర్లకు నిత్యావసర వస్తువులను అందజేశారు.

Related Posts