హైదరాబాద్, ఫిబ్రవరి 18,
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. వారిలో సగం మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లే ఉండటంతో వారి మద్దతు ఎవరికి దక్కనుంది.. నిరుద్యోగులు ఎవరికి అండగా నిలుస్తారనేది ఆసక్తిగా మారింది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పార్టీల లీడర్లు, ఇండిపెండెంట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ –- రంగారెడ్డి –- మహబూబ్‌నగర్‌తోపాటు నల్గొండ –- ఖమ్మం –- వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు వచ్చే నెల 14న పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో పోటీకి దిగుతున్న వాళ్లంతా ఇప్పటికే ప్రచారాన్ని షురూ జేశారు. నామినేషన్లు పూర్తయిన తర్వాత మరింత జోరుగా ప్రచారం చేపట్టనున్నారు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే నాటికి ‘హైదరాబాద్’ నియోజకవర్గంలో 5,21,386 మంది, ‘నల్గొండ’ నియోజకవర్గంలో 4,92,943 మంది ఓటర్లు ఉన్నారు.తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పాటు చేసిన పీఆర్సీ తన రిపోర్టు ఇవ్వడానికి 32 నెలల టైం తీసుకోవడం, ఫిట్మెంట్ను అతి తక్కువగా సిఫార్సు చేయడంపై ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కోపంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే పీఆర్సీ ప్రకటిస్తారని ఆశించినా.. చర్చల పేరుతో లేట్ చేసి మొత్తానికే అటకెక్కించారు. మరోవైపు తమను ప్రభుత్వం వేరుగా చూస్తోందని టీచర్లు కోపంగా ఉన్నారు. టీచర్లు, ఉద్యోగులు వేర్వేరు అని, టీచర్లకు పని దినాలు తక్కువని, వారికి పీఆర్సీ ఫిట్‌మెంట్ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాల్సిన అవసరం లేదని, రిటైర్మెంట్ వయసు పెంచాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలే లీకులు ఇవ్వడంపై టీచర్లు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఆరు ఉమ్మడి జిల్లాల్లో 2.20 లక్షల మంది ఉద్యోగులు, 1.80 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. రిటైర్మెంట్ వయసు పెంచుతామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంపైనా ఎంప్లాయీస్ గరంగా ఉన్నారు. ప్రమోషన్లు ఇస్తామన్న మాట కూడా నిలబెట్టుకోలేదని మండిపడుతున్నారు.2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నెలకు రూ. 3,016 నిరుద్యోగ భృతి ఇస్తామని టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. రెండు వారాల కింద తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రెండు మూడు రోజుల్లో నిరుద్యోగ భృతిపై సీఎం ప్రకటన చేస్తారని చెప్పారు. మేనిఫెస్టోనే కాదు కేటీఆర్ మాట ఇచ్చిన తర్వాత కూడా నిరుద్యోగ భృతిపై ఒక్క అడుగూ ముందుకు పడలేదు. త్వరలోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం హామీ ఇచ్చి రెండు నెలలు దాటినా.. అది కూడా ముందుకు సాగడం లేదు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి జాబ్స్ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు, యువత ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం అడపాదడప నోటిఫికేషన్లు వేసినా.. అందులో పెద్ద నోటిఫికేషన్లు లేవు. రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయడం లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇటీవల పీఆర్సీ ఇచ్చిన రిపోర్టులో కూడా రాష్ట్రంలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంపై నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. జోనల్ సమస్యను కూడా ప్రభుత్వం ఇప్పటికీ తేల్చలేదు.అధికార పార్టీపై ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుద్యోగుల్లో ఉన్న ప్రతికూలత ఎవరికి లాభం చేస్తుందనేది అంతుపట్టడం లేదు. ఎవరు వెళ్లి ఓట్లు అడిగినా ఓటర్లు ఓకే చెప్తున్నారు. ఒకరిద్దరు క్యాండిడేట్ల తరఫున ఓటర్లు కొంత పోలరైజ్ అయినట్టు కనిపిస్తున్నా ఆ టెంపో పోలింగ్ రోజు వరకు కంటిన్యూ చేయగలరా అనేది ప్రశ్నగా మారింది. అధికార పార్టీ అభ్యర్థి ఓట్లు అడిగినా మద్దతిస్తామని చెప్పడం.. అదే విషయం మిగతా అభ్యర్థులతోనూ చెప్తుండటంతో ఓటరు తీర్పుపై ఎవరూ ఒక అంచనాకు రాలేకపోతున్నారు.నల్గొండ –ఖమ్మం–వరంగల్ స్థానం నుంచి టీఆర్ఎస్ తన సిట్టింగ్ ఎమ్మెల్సీని రంగంలోకి దించగా, హైదరాబాద్ –రంగారెడ్డి–మహబూబ్నగర్ నుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ సిట్టింగ్ స్థానంగా ఉన్న ‘హైదరాబాద్’లో పోటీకి దూరంగా ఉండటమే బెటర్ అనే భావనలో టీఆర్‌ఎస్ లీడర్లు ఉన్నట్టు తెలుస్తోంది. రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అధికార పార్టీకి గట్టి సవాల్ విసురుతున్నారు. ప్రభుత్వ ఫెయిల్యూర్స్ను అడుగడుగునా ఎండగడు తున్నారు. ఏ ఆకాంక్షల కోసం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేరడం లేదని అంటున్నారు. ఉద్యోగులకు పీఆర్సీ రావడం లేదని, వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసిందని ప్రచారంలో కడిగేస్తున్నారు.2019లో జరిగిన కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు టీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్ ఇచ్చారు. మండలిలో కాంగ్రెస్ పార్టీకి ఐడెంటిటీ లేకుండా చేయాలని అనుకున్న టీఆర్ఎస్కు చదువుకున్నోళ్లు దిమ్మతిరిగే తీర్పు చెప్పారు. ఆ ఎన్నికలో కాంగ్రెస్ క్యాండిడేట్ జీవన్రెడ్డిని గెలిపించారు. ఇప్పుడు జరుగబోయే ‘హైదరాబాద్’, ‘నల్గొండ’ గ్రాడ్యుయేట్ నియోజక వర్గాల్లోనూ తమకు వ్యతిరేక ఫలితమే వస్తుందా అనే భయం టీఆర్ఎస్ నేతలను వెంటాడుతోంది. జూనియర్ పంచాయతీ సెక్రటరీలు, ఏఈవోలు, కరెంట్ ఆర్టిజన్లు మాత్రమే తమకు కొంత అనుకూలంగా కనిపిస్తున్నారని, మిగతా సెక్షన్లలో ప్రభుత్వంపై నిరసన ధోరణి వ్యక్తమవుతోందని కొందరు టీఆర్‌ఎస్ లీడర్లే చెప్తున్నారు. కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఓటర్ల నమోదు నుంచి ఫాలో అప్ చేస్తున్నా.. గ్రౌండ్ లో సానుకూల వాతావరణం కనిపించడం లేదని అంటున్నారు.