YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

ఇబ్బందుల పర్వానికి తెరపడేదెన్నడు?

ఇబ్బందుల పర్వానికి తెరపడేదెన్నడు?

ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రాజెక్టును చేపట్టింది. ఈ పథకం చాలాకాలం క్రితమే పూర్తవ్వాల్సి ఉన్నా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పనులు సాగుతూనే ఉన్నాయి. దీంతో కొన్ని గ్రామాల్లో తాగునీటికి కటకట నెలకొంది. ఇలాంటి బాధిత ప్రాంతాల్లో నిజామాబాద్ లోని నవీపేట కూడా ఉంది. స్థానికంగా భగీరథ పనులు చాలాకాలంగా సాగుతూనే ఉన్నాయి. దీంతో నీటి సమస్యకు తోడు ఇతరత్రా సమస్యలు స్థానికులను వేధిస్తున్నాయి. మిషన్ భగీరథకు సంబంధించిన పనులు నెమ్మదిగా సాగుతుండడమే దీనికి కారణంగా స్థానికులు చెప్తున్నారు. తాగునీటి సమస్యకు తోడు స్థానికంగా ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది. పారిశుద్ధ్యం సైతం అస్తవ్యస్తంగా మారింది. ఇది చాలదన్నట్లు కొందరు అక్రమార్కులు ఇసుక అక్రమరావాణా చేస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు. మొత్తంగా నవీపేట మండలం వాసులు వివిధ సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికార యంత్రాంగానికి విజ్ఞప్తిచేస్తున్నారు. పలు గ్రామాల్లో మిషన్‌ భగీరథ పథకం కింద 44 వోహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులు నిర్మించాల్సి ఉంది.

 

అయితే 8 చోట్ల మాత్రమే పనులు ప్రారంభించారు. దీంతో ఈ ఏడాది డిసెంబరు నాటికి పనులు పూర్తి కావడం అనుమానమే అని అంతా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా స్థానికంగా 1,15,714 కిలో మీటర్ల మేర అంతర్గత పైపులైన్లు వేయాలి. కానీ ఆ పనులు ఇప్పటికీ చేపట్టలేదని సమాచారం. గ్రామాల మీదుగా వేసిన ప్రధాన పైపులు అడ్డగోలుగా వేశారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల పైప్ లైన్ల కోసం తీసిన గోతులు పూడ్చకుండానే వదిలేయడంతో గ్రామస్థులు నానాపాట్లు పడుతున్నారు. మరోవైపు వేసవి ఎఫెక్ట్ తీవ్రమవడంతో తాగునీటికి సమస్యలు ఎదురవుతున్నాయి. సాగు నీటి కోసమూ రైతులూ తపించిపోతున్నారు. ఈ సమస్యలన్నింటినీ గుర్తించి సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని స్థానికులు అధికారయంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తిచేస్తున్నారు.

Related Posts