YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు

ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు

అధికారయంత్రాంగం ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, ఉదాసీనంగా ఉన్నా అక్రమార్కులు సహజ సంపదను కొల్లగొట్టేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు చెందాల్సిన ఆదాయాన్ని జేబు చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగిపోతున్నాయి. ఈ దందాను అరికట్టేందుకు ప్రభుత్వం, అధికారయంత్రాంగం కృషి చేస్తున్నా అక్రమార్కులు అడ్డదారుల్లో తమ దందా సాగించేస్తున్నారు. ఈ దందానే స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమోగానీ మెదక్ శివ్వంపేట మండలంలో కొందరు అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా మట్టితవ్వకాలు సాగించేస్తున్నారు. పలు గ్రామాల్లో ఈ దందా జోరుగా సాగిపోతున్నా అధికారులు చూసీచూడన్లు వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా సాగుతున్న తవ్వకాల్లో అనుమతులు లేనివే అధికం. అయితే ఈ విషయాన్ని అధికారులు పెద్దగా పట్టించుకోవడంలేదు. ఇదే అదునుగా అక్రమార్కులు ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతుండటంతో చెరువులు, కుంటలు ప్రమాదకరంగా మారుతున్నాయి. సికింద్లాపూర్‌లోని లోతని చెరువులో రాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా అక్రమాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఇక్కడ తీసిన మట్టిని నగరానికి తరలించుకుపోయి విక్రయిస్తున్నారు. ఒక్కసారి చెరువును పరిశీలిస్తే గుంతలు ఎంతలోతులో ఏర్పడ్డాయో సులువుగానే తెలిసిపోతుంది. మట్టి తవ్వకాలకు పలువురు జేసీబీ యంత్రాలను సైతం వినియోగిస్తున్నారు. దీంతో భారీ గుంతలు ఏర్పడుతున్నాయి. ఈ గుంతల్లో నీళ్లు చేరుతుండడంతో ఎంత లోతు ఉందో గుర్తించలేని పరిస్థితి ఉంది. ఫలితంగా ఇటీవల వాటిల్లోకి పలువురు స్నానాలకని దిగి మృత్యువాత పడ్డారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో స్థానికుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు సాగుతున్నా సంబంధిత శాఖ అధికారులు మాత్రం అటు వైపు చూడటమే లేదని ప్రజలు మండిపడుతున్నారు. అధికారులనిర్లక్ష్యాన్నే ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నాయని చెప్తున్నారు. నిబంధనలను అతిక్రమించి, అనుమతి ఉన్న మేర కంటే ఎక్కువ లోతులో తవ్వకాలు జరుపుతుండటంతో ప్రమాదకరంగా మారుతున్నాయని వాపోతున్నారు. అక్రమ తవ్వకాల దందా విషయమై స్ధానికుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతుండడంతో అధికారులు స్పందించారు. అనుమతులు లేకుండా తవ్వకాలు సాగిస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామని, నిబంధనలు సక్రమంగా అమలు అయ్యేలా చూస్తామని చెప్పారు.

Related Posts