
ఎప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు కుంభమేళా
డెహ్రాడూన్ ఫిబ్రవరి 18
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కుంభమేళా జరిగే రోజులను తగ్గించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది కుంభమేళాను కేవలం 30 రోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్ గురువారం ఉదయం వెల్లడించారు. కుంభమేళా నిర్వహణకు సంబంధించి మార్చి చివరినాటికి ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు కుంభమేళాను నిర్వహించనున్నారు.అయితే కుంభమేళాకు తరలివచ్చే భక్తులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. ఈ రిపోర్టులో నెగిటివ్ వస్తేనే కుంభమేళాకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. కొవిడ్ రిపోర్టు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదని తేల్చిచెప్పారు. భక్తుల రద్దీని పర్యవేక్షించేందుకు ఘాట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. కుంభమేళాను ప్రతి పన్నేండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. అయితే కుంభమేళా జనవరి రెండో వారంలో ప్రారంభమై ఏప్రిల్ చివరికి ముగుస్తుంది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ సారి కేవలం 30 రోజులకే పరిమితం చేశారు.