YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఉపాధి హామీలో అక్రమాలు

ఉపాధి హామీలో అక్రమాలు

ఉపాధి హామీలో అక్రమాలు
నల్గొండ, ఫిబ్రవరి 19,
ఉపాధి హామీ పథకంలో అక్రమాల పరంపర కొనసాగుతోంది. వలసలను నిరోధించేందుకు, ఉన్న చోటే ఉపాధి కల్పించే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారింది. అభివృద్ధి పనులు చేయకుండానే చేసినట్లు, మొక్కలు నాటకుండానే నాటినట్లు, కూలీలకు పని కల్పించకుండానే కల్పించినట్లు, తక్కువ పనులు చేసి ఎక్కువ పనులు చేసినట్లు లెక్కలు రాయడం.. ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వారు నిధులను పక్కదారి పట్టిస్తున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు పనులు కల్పించి వలసలను నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2006లో ఉపాధిహామీ చట్టాన్ని తీసుకువచ్చింది. అప్పటి నుంచి క్షేత్రస్థాయిలోనే కూలీలకు పనులు   కల్పిస్తున్నారు. ఏడాదిలో సగటు 100 రోజుల పని కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కరవు పరిస్థితులు నెలకొన్న రాష్ట్రాల్లో అదనంగా పని దినాలు కల్పిస్తున్నారు. ఈ పథకంలో ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా చేపడుతున్న పనుల్లో అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. వాటిని గుర్తించేందుకు సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీటిలో అనేక అక్రమాలు బహిర్గతం అవుతున్నాయి. కోట్లాది రూపాయల నిధులు పక్కదారి పడుతున్నట్లు తేలుతోంది.నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు తొమ్మిది సార్లు సామాజిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గుర్తించిన అక్రమాల నివేదికలను తనిఖీ బృందాలు జిల్లా కార్యాలయంలో సమర్పించాయి. తనిఖీ బృందాలు అందచేసిన నివేదికల్లోని అంశాలను తిరిగి అధికారులు పరిశీలన చేసి జిల్లాల్లో రూ.1.73 కోట్ల మేర దుర్వినియోగం జరిగినట్లు నిర్ధరించారు. నిధుల పక్క దారికి బాధ్యులను గుర్తించారు. వారిపై చర్యలు తీసుకున్నారు. నోటీసులు జారీ చేయడంతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. నిధులు పక్కదారి మళ్లించిన వారి నుంచి రికవరీకి చర్యలు చేపట్టారు. కానీ ఇప్పటి వరకు జిల్లాలో 69.60 లక్షలు మాత్రమే రికవరీ అయ్యాయి. ఇంకా రూ.1.03 కోట్లు రికవరీ కావల్సి ఉంది. వీటిలో అధికారులు జారీ చేసే నోటీసులకు అక్రమార్కులు స్పందించడం లేదు. దుర్వినియోగం చేసిన నిధులను తిరిగి చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. మొండిగా వ్యవహరిస్తున్నారు.ఉపాధి హామీ పనుల్లో నిధులను పక్కదారి పట్టించి తిరిగి ప్రభుత్వానికి నిధులు చెల్లించడంలో మొండిగా వ్యవహరించే అక్రమార్కులపైౖ రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించి డబ్బు వసూలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చట్టం ఉపాధిహామీలో నామమాత్రంగా మిగిలిపోయింది. దీన్ని ఉపయోగించి నిధులను రికవరీ చేసిన దాఖలాలు లేవు. నల్గొండ జిల్లాలో దుర్వినియోగమైన నిధుల రికవరీకి సబంధించి 50 మందికి పైగా ఆర్‌ఆర్‌ యాక్టు కింద నోటీసులు జారీ చేశారు. కానీ వారి నుంచి స్పందన కరవయ్యింది. ఈ చట్టం కింద చర్యలు తీసుకునేందుకు పలు విధాలుగా పరిశీలనలు, నివేదికలు రూపొందించాల్సి ఉంటుంది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. తొలుత అక్రమాలకు పాల్పడిన వారి ఆస్తుల వివరాల నివేదిక సంబంధిత తహాసీల్దార్‌ నుంచి జిల్లా కార్యాలయానికి అందాల్సి ఉంటుంది. ఇక్కడ రెవెన్యూ అధికారులు శ్రద్ధ చూపడం లేదు. సకాలంలో విచారణ చేసి పత్రాలను అందజేయడం లేదు. దీంతో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. చివరికి పటుత్వం లేని పత్రాలు పంపిస్తుండటంతో నీరుగారిపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో డీఆర్‌డీవో అధికారులు నేరుగా నోటీసులు జారీ చేస్తూ అక్రమార్కులపై ఒత్తిడి చేెస్తూ రికవరీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.నల్గొండ జిల్లాలో ఉపాధి హామీ పనులకు సంబంధించి  సామాజిక తనిఖీలు చేస్తున్నారు. వీటిల్లో మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో ఆరు మండలాల్లో తనిఖీలు పూర్తి చేయగా రూ.కోటి వరకు నిధులు దుర్వినియోగమైనట్లు తనిఖీ బృందాలు గుర్తించాయి. అక్రమాల్లో భాగస్వాములైన 10 మంది క్షేత్ర సహాయకులు, ఒక సాంకేతిక సహాయకుడిని విధుల నుంచి తప్పించారు. 

Related Posts