సూర్యప్రభ వాహనంలో శ్రీవారు
తిరుమల ఫిబ్రవరి 19,
తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5.30 గంటలకు మొదలైన ఉత్సవాలు, రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి. తిరు మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారిని వీక్షించేందు కు వందల మంది భక్తులు బారులు తీరారు. కరోనా నిబంధనలతో భారీగా జనం గుమిగూడకుండా గ్యాలరీలతో పాటు బారికేడ్లను అమర్చారు. కొవిడ్ నిబంధనల మేరకు దర్శన టికెట్లున్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు.రథసప్తమి రోజున స్వామి వారు ఒకేరోజు తెల్లవారుజా ము నుంచి రాత్రి వరకు 7 వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం సూర్యప్రభ వాహనం, తర్వాత 9 గంటలకు చిన్న శేష వాహనం, 11 గంటలకు గరుడ వాహనం, మధ్యాహ్నం ఒంటిగంటకు హనుమంత వాహనంపై శ్రీవారు మాఢ వీధుల్లో విహరిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు కల్ప వృక్ష వాహనం, 6 గంటలకు సర్వ భూపాల వాహనం, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామి వారు ఊరేగుతారు.రథసప్తమి సందర్భంగా ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. స్వామి వారికి నిత్యం జరిగే సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను పూర్తి ఏకాంతంలో నిర్వహించారు. మాఘ మాసం శుక్ల పక్షం సప్తమిని రథసప్తమి పర్వదినంగా, సూర్య జయంతిగా భక్తజనులు ఘనంగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. సూర్యరథం దక్షిణాయనం ముగించి, పూర్వోత్తర దిశగా పయనం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.మాఘ సప్తమి మొదలు.. వచ్చే ఆరు మాసాలూ ఉత్తరాయణ పుణ్యకాలం. అంతటి విశిష్టత ఉన్న ఈ రోజు.. ఏడాదికోసారి ఈ రోజున సూర్య భగవానుని నిజరూప దర్శనం భక్తులకు మరపురాని మధురానుభూ తిని కలిగించే ఘట్టంగా నిలుస్తోంది. సూర్యరథానికి కూర్చిన ఏడు గుర్రాలు ఏడు వారాలకు, పన్నెండు చక్రాలు పన్నెండు రాశులకు సంకేతాలు. రథ సప్తమి నుంచి వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. ఉగాది నాటికి ప్రకృతి సొగసులు సంతరించుకుంటుంది.