YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

సత్వరమే సేకరణ సాగాలి

సత్వరమే సేకరణ సాగాలి
రైతులు తాము పండించిన వ్యవసాయోత్పత్తులకు మద్దతుధర లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను సేకరిస్తోంది. ఈ చర్యల్లో భాగంగానే రబీలో పండిన ధాన్యాన్నీ సేకరించాలని నిర్ణయించింది. దీనికోసం ఐకేపీ, పీఏసీఎస్ ల ఆధ్వర్యంలో ధాన్యం సేకరణకు చర్యలు ప్రారంభించింది. రెండుశాఖల పర్యవేక్షణలో వేర్వేరుగా ధాన్యం సేకరణ కొనసాగుతోంది. ఈ కేంద్రాల ద్వారా మొత్తంగా 16లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు అధికారులు. రైతులు పంటను దళారులకు అమ్మకుని నష్టపోకూడదన్న భావనతో విధానాలు కూడా రూపొందించుకున్నారు. ప్రభుత్వం అందించే మద్దతు ధర కేవలం రైతులకే దక్కేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈ సారి వీటిని వీలైనంత తొందరగా కొనుగోళ్లు ప్రారంభించాలని నిర్ణయించారు. జిల్లాలో 171 కేంద్రాలకుగాను ప్రస్తుతం 115 ప్రారంభమయ్యాయి. వీటిలో సగానికిపైగా కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభంకాలేదు. దీంతో పూర్తిస్థాయిలో కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని కేంద్రాల్లోనూ కొనుగోళ్లు జరపాలని రైతులు కోరుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో కొంత జాప్యం నెలకొనడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే వాతావరణ మార్పుల వల్ల తరచూ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ధాన్యం తడిచిపోతుందనే భయం వారిని వెన్నాడుతోంది. చాలామంది రైతులకు పంట భద్రపరచుకునే సదుపాయాలు లేవు. ఫలితంగా వారంతా వీలైనంత త్వరగా పంటను విక్రయించాలనే భావిస్తున్నారు. ఇదిలాఉంటే కొనుగోలు కేంద్రాల వద్దకు ఇప్పటికే పెద్దమొత్తంలో ట్రాక్టర్లలో ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులు ఉన్నారు. కొనుగోళ్లకు మరికొన్ని రోజులు సమయం పడుతుందని సిబ్బంది చెప్తుండడంతో వారు అక్కడే ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. అయితే వర్షాలు పడితే మాత్రం వారి జీవితాలు తీవ్రంగా ప్రభావితమవడం ఖాయం. రైతులకు టార్పలిన్ కవర్లు సరిగా అందక తిప్పలుపడుతున్నారు. కొందరైతే సొంతంగా కవర్లు తెచ్చుకుని పంటను కాపాడుకునేందుకు పాట్లు పడుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ గుర్తించి త్వరితగతిన ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు అధికారులకు విజ్ఞప్తిచేస్తున్నారు.

Related Posts