తిరుపతి ఫిబ్రవరి 19
భగవాన్ సూర్య జయంతి సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తర్వాత 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు గ్యాలరీల్లో బారులు తీరి, స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయాన్ని పుష్పాలతో తీర్చిదిద్దారు. రథసప్తమి సందర్భంగా స్వామి వారికి జరిగే ఆర్జిత సేవలైన కల్యాణోత్సం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు. సుప్రభాతం, తోమాల, అర్చనలను, అభిషేక సేవలను ఏకాంతంగా నిర్వహించారు. మాడ వీధుల్లో భక్తులకు తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం, అత్యవసర వైద్యసేవలు అందుబాటులో ఉండేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.