YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఆజాద్ కు కమలం గాలమా

ఆజాద్ కు కమలం గాలమా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20, 
రాహుల్ ఊరికే అనలేదు. పార్టీలో బీజేపీ కోవర్టులు ఉన్నారని కొంతకాలం క్రితం రాహుల్ గాంధీ చేసిన ప్రకటన నిజమయ్యేటట్లే కనిపిస్తుంది. ఆరు నెలల క్రితం సోనియా గాంధీకి 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీకి లేఖ రాశారు. వెంటనే పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని నియమించాలని కోరారు. అంతేకాదు పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనం కావడానికి గల కారణాలను కూడా వారు ఆ లేఖలో పేర్కొన్నారు. లేఖ రాసిన వారిలో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఒకరు.ఆ సందర్భంగా రాహుల్ గాంధీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వెనకఉండి కొందరిని నడిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఇది సీనియర్ నేతలను ఉద్దేశించి చేసినవే. దీంతో గులాం నబీ ఆజాద్ రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు. తాము బీజేపీ ట్రాప్ లో పడబోమని తెలిపారు. రాహుల్ వ్యా‌ఖ్యల తర్వాత కూడా గులాం నబీ ఆజాద్ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఇటీవల సోనియా గాంధీ సీనియర్ నేతలతో చర్చించారు. పార్టీ అధ్యక్ష పదవిపై అందరి అభిప్రాయాలను తీసుకున్నారు.కానీ గులాం నబీ ఆజాద్ బీజేపీకి దగ్గరవుతున్నట్లే కనపడుతుంది. ఆ లేఖ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆజాద్ ను పక్కన పెట్టిందనే చెప్పాలి. ఆయన రాజ్యసభలో సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఒక కమిటీని కూడా నియమించింది. రాహుల్ తో సహా ఎవరూ గులాం నబీ ఆజాద్ ను కలిసేందుకు ఇష్టపడని పరిస్థితి ఏర్పడింది. దీంతో గత కొంతకాలంగా గులాం నబీ ఆజాద్ పై ప్రచారం జరుగుతుంది. కాశ్మీర్ లో మారుతున్న పరిణామాల దృష్ట్యా గులాం నబీ ఆజాద్ ను పార్టీలోకి తీసుకురావాలన్నది బీజేపీ ఆలోచన.గులాం నబీ ఆజాద్ రాజ్యసభ పదవీ కాలం ఈనెల 15వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత ఆయనను తిరిగి కాంగ్రెస్ రాజ్యసభకు నామినేట్ చేస్తుందన్న నమ్మకం లేదు. బీజేపీ ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సయితం పదే పదే ఆజాద్ ను పొగుడుతుండటం దీనికి నిదర్శనమంటుననారు. కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అయితే ఆజాద్ కు తాము రాజ్యసభ పదవి ఇస్తామని ప్రకటించారు. మొత్తం మీద రాహుల్ అనుమానిస్తున్నదే నిజమయిందన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నుంచి విన్పిస్తున్నాయి.

Related Posts