హైదరాబాద్, ఫిబ్రవరి 20,
గ్రేటర్‌లో బియ్యం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఫైన్ క్వాలిటీ సన్నబియ్యం గత ఏడాది కిలోకు రూ.40 నుంచి రూ.45 పలికితే ప్రస్తుతం రూ.48 నుంచి రూ.55కు చేరాయి. డిమాండ్ కంటే ఎక్కువగా మార్కెట్‌కు బియ్యం నిల్వలు వస్తున్నా ధరలు మాత్రం తగ్గడంలేదు. వ్యవసాయాధారిత ఉత్పత్తులపై పన్నులు ఎత్తివేసినా పరిస్థితిలో మార్పు రావడంలేదు. వ్యాపారులు పన్నులు చెల్లించిన సమయంలో బియ్యం ధరలు తక్కువగా ఉండేవి. ప్రస్తుతం పన్నులు రద్దయినా ధరలు పెరగడంపై వినియోగదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్లు, రిటైల్ వ్యాపారులు కలిసి కొనుగోలుదారుల జేబులను గుల్ల చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ కొరవడటంతోనే వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారనే విమర్శలూ ఉన్నాయి.
జంట నగరాల్లోని హోల్‌సేల్ మార్కెట్లలో బియ్యం ధరలకు, రిటైల్ ధరలకు పొంతన కుదరడంలేదు. గ్రేటర్ పరిధిలో దాదాపు 240 రైస్‌మిల్లర్లు ఉన్నారు. వీరి నుంచి రిటైల్ వ్యాపారులు తక్కువ ధరకే బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మిల్లర్ ధర క్వింటాలు బియ్యానికి రూ.3,200 నుంచి రూ.3,600 పలుకుతున్నాయి. కానీ మార్కెట్‌కు చేరిన తర్వాత రిటైల్ వ్యాపారులదే రాజ్యంగా మారింది. ప్రస్తుతం సన్నబియ్యం ఫైన్ క్వాలిటీ క్వింటాలుకు రూ.4,800 నుంచి రూ.5,500 చేరింది. గ్రేటర్ పరిధిలోని దాదాపు 2,500 మంది రిటైల్ వ్యాపారులు బియ్యం ధరలను శాసిస్తున్నారు. చిన్నాచితకా కిరాణా వ్యాపారులు సైతం ఇష్టారీతిన ధరలు పెంచి అమ్ముతున్నారు. గత ఏడాది క్వింటాలు సన్న బియ్యం రూ.4,200 నుంచి రూ.4,500 పలకగా ప్రస్తుతం సుమారు వరకు పెంచి అమ్ముతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది వరి ధాన్యం దిగుబడులు భారీగా పెరిగాయి. ఖరీఫ్, రబీ సీజన్లలో దాదాపు 80లక్షల మెట్రిక్ టన్నులు సేకరించి ప్రభుత్వం మిల్లర్లకు అందజేసింది. గ్రేటర్ పరిధిలోని మిల్లర్ల వద్ద లక్షన్నర మెట్రిక్ టన్నులకుపైగా బియ్యం నిల్వలు ఉన్నట్లు సమాచారం. జంటనగరాల్లో బియ్యం వినియోగం పెరుగుతోంది. రోజుకు 32 నుంచి 35 వేల క్వింటాళ్ల బియ్యం వినియోగిస్తున్నట్లు అంచనా.