ఆరోగ్యం
మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవలిగా ఫ్లోరైడ్ సమస్య పెరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కేవలం మహబూబ్‌నగర్‌లోనే కాకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బాధితులు సంఖ్య అధికమవుతున్నట్లు తెలుస్తోంది. పలు గ్రామాలకు ఫ్లోరైడ్ నీరే దిక్కవడంతో ఈ నీటిని సేవిస్తున్నవారు అనారోగ్యాల బారినపడుతున్నారు. సుమారు 185గ్రామాల్లో ఈ దుస్థితి ఉన్నట్లు సమాచారం. సమస్యను గుర్తించిన సర్కార్ అవగాహన చర్యలుమొదలు పెట్టింది. అధికారులు కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి గ్రామాల్లో నీటిని సేకరించడం, ఇంటింటి సర్వే, విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్కువ మందిలో దంత సంబంధిత ఫ్లోరోసిస్ ఉన్నట్లు టెస్టుల్లో తేలింది. పెద్ద వయసు వారిలో ఎముకలకు సంబంధించిన సమస్యలు గుర్తించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని రాచాలపల్లిలో అత్యధికంగా 4.2 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ ఉంది. ఈ గ్రామంలో ఫ్లోరోసిస్ బాధితులూ ఎక్కువగానే ఉన్నారు.
జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో పలు చర్యలు తీసుకుంటోంది. సమస్య తీవ్రత అధికంగా ఉన్న గ్రామాల్లో సర్వే కొనసాగించాలని అధికారులను ఆదేశించింది. గ్రామాల్లోనే కాక పాఠశాలల్లోనూ ఫ్లోరైడ్‌పై అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని పేర్కొంది. ప్రస్తుతం బడులకు సెలవులు కావడంతో గ్రామాల్లోనే అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇదిలాఉంటే అవగాహన కార్యక్రమాలటిపై వైద్యాధికారులు, ఆర్‌బీఎస్‌కే సిబ్బందితోపాటు క్షేత్రసాయిలో ఉండే వైద్య సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సర్కార్ స్పష్టంచేసింది. ఎవరికైనా ఫ్లోరోసిస్ ఉన్నట్లు అనుమానాలు ఉంటే వైద్య పరీక్షలు నిర్వహించి డీఈఐసీ కేంద్రంలోని వైద్యులకు తెలిపి వైద్య సేవలు అందించాలని తేల్చిచెప్పింది. ఇదిలాఉంటే ఫ్లోరోసిస్ సమస్య విజృంభిస్తుండడంతో బాధిత గ్రామాల్లో భయాందోళనలు అలముకున్నాయి. ప్రభుత్వం సురక్షిత తాగునీరు అందించాలని, ఫ్లోరైడ్ రక్కసి నుంచి తమను కాపాడాలని అంతా కోరుతున్నారు.
విస్తరిస్తున్న ఫ్లోరోసిస్!