YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

ఇసుకలో బోరు..చిటికెలో నీరు..!

ఇసుకలో బోరు..చిటికెలో నీరు..!
తెలుగురాష్ట్రాల్లో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. తెలంగాణలో అయితే ప్రమాదకరస్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో జల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. చెరువులు తవ్వించడంతో పాటూ నీటి కుంటల ఏర్పాటుపై ప్రచారం చేస్తోంది. ఈ చర్యలతో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడింది. సాగు, తాగునీటికి పెద్దగా ఇబ్బందులు ఉండడంలేదు. కానీ, నాణేనికి మరో పార్శ్వంలా సాగునీటికే కాక తాగునీటికీ పలు ప్రాంతాల్లో కటకట ఉంటోంది. ఇలాంటి సమస్యలతో విసుగెత్తిన యాదాద్రి జిల్లాలో కొందరు రైతులు ఇసుకలో బోర్లు ఏర్పాటుచేసుకుంటున్నారు. నదీ పరివాహకం, వాగు సమీపంలో ఈ తరహా బోర్లు తవ్వించుకోవడం ద్వారా చాలా సులభంగా నీటిని పొందుతున్నారు. సాధారణ భూమిలో అయితే బోరు వేయాలంటే వందల అడుగులు లోతు తవ్వాల్సి వస్తుంది. అంత లోతు తవ్వినా నీరు పడితే సరే, బండ పడిందంటే మరో చోట ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకోవాల్సిందే. దీంతో బోర్లు వేయించుకునేవారికి ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. అయితే ఇసుకలో వేసే బోర్లకు ఇలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే తీరప్రాంతం కావడంతో కచ్చితంగా నీరు ఉంటుంది. అంతేకాక ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉంటుంది. భారీ ప్రాజెక్టులు లేని యాదాద్రి జిల్లాలోని మోత్కూరు, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, అడ్డగూడూరు, ఆత్మకూర్‌(ఎం), శాలిగౌరారం తదితర మండలాల్లో ఇసుకబోర్లు అధికంగా ఉన్నాయి. ఈ బోర్ల ద్వారానే స్థానిక రైతులు 25 ఏళ్లకుపైగా తమ పొలాలకు సాగునీరు సరఫరా చేసుకోగలుగుతున్నారు. ఒక్కో గ్రామ పరిధిలో 150 నుంచి 200 పైగా ఇసుక బోర్లు ఉండడంతో వీటి ద్వారా వేలాది ఎకరాలకు సకాలంలో నీరు అందుతోంది. వాస్తవానికి మూసీనది, బిక్కేర్లు ఈ ప్రాంత రైతులకు పెద్దనీటి వనరులు. వర్షాకాలంలో ఇవి నీరు పారడంతో నేరుగా చెరువులు, కుంటలు నిండుతుంటాయి. ఒక్కసారి నీరుపారితే... వీటి వెంట ఇసుకలో తవ్వుకునే బోర్లు(ఫిల్టర్‌ పాయింట్లు) ఏడాదంతా నీటిని సరఫరా చేయగలవు. నదుల వెంట ఇసుకలో బోరు తవ్వుకోవడం చాలా సులువు అని రైతులు చెప్తున్నారు. ఇలాంటి బోర్లకు ఇరవై అడుగులకంటే ఎక్కువ లోతు తవ్వాల్సిన పని ఉండదని అంటున్నారు. ఈ బోర్లను తవ్వేపనిని రైతులే చేస్తున్నారు. ఇతర రైతులకు అవసరమైన చోట ఇసుక బోర్లు ఏర్పాటుచేసుకునేందుకు సహకరిస్తున్నారు. సాగు నీటి సమస్యలు అధిగమించేందుకు యాదాద్రికి చెందిన రైతాంగం ఇసుకలో బోర్లు వేసుకుని తమ సమస్యను పరిష్కరించుకున్నారు. వారి బాటలోనే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులు బృందంగా ఏర్పడి బోర్లు ఏర్పాటు చేసుకుంటే సాగునీటి కష్టాలకు కొంతైనా తెరపడే అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

Related Posts