YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

విదేశీ విహంగం..కాపాడితేనే ఆనందం..

విదేశీ విహంగం..కాపాడితేనే ఆనందం..
సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తికి వేసవి ప్రారంభసమయంలో విదేశీ పక్షులు వస్తుంటాయి. స్థానిక చెట్లను ఆవాసంగా మలచుకుని సంతానాభివృద్ధిలో నిమగ్నమవుతాయి. అయితే కొంతకాలంగా ఇక్కడికి వలస పక్షుల రాక మందగించింది. నీటివనరుల లభ్యత క్షీణించడమే దీనికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు. ఏదేమైనా తుంగతుర్తి ప్రాంతానికి మాత్రం ఈ విహంగాల రాక ఏటా నిరంతరాయంగా సాగుతోంది. దాదాపు 30 ఏళ్లుగా ఇక్కడికి వలసపక్షులు వచ్చిపోతున్నట్లు స్థానికులు చెప్తుంటారు. వేలమైళ్లు ప్రయాణంచేసి తమ ప్రాంతానికి వచ్చే ఈ అతిథులను కంటికిరెప్పలా కాపాడుకుంటున్నారు. సంతానోత్పత్తి చేసేందుకు వందల సంఖ్యలో వచ్చే విదేశీ పక్షులకు ఎటువంటి హాని కలగకుండా చూసుకుంటున్నారు. కానీ ప్రభుత్వపరంగా వీటికి రక్షణ కల్పించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోకపోవడం సమస్యాత్మకంగా ఉన్నట్లు స్థానికులు వాపోతున్నారు. దీంతో పక్షుల భద్రత ప్రమాదంలో పడుతోందని ఏటికేడు వాటికి సమస్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం సత్వరమే స్పందించి పక్షులకు ఆహారంతో పాటూ మంచినీరూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తెలంగాణలో పర్యాటకం అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఈ క్రమంలో తమ ప్రాంతంపైనా దృష్టిసారించి విదేశీ పక్షుల భద్రతకు పక్కా ప్రణాళికలు అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి పెద్దఎత్తున ఆదాయం సమకూరుతుందని స్పష్టంచేస్తున్నారు. తుంగతుర్తిలోనే కాక పస్తాల, కర్మిరాల కొత్తగూడెం గ్రామాలు విదేశీ పక్షుల విడిది కేంద్రాలుగా ఉన్నాయి. ఇక్కడికి పెయింటెడ్‌ స్టార్క్‌ హిమాలయ పర్వతాల నుంచి ఏటా శీతాకాలం ముగిసే సమయానికి వస్తాయి. గుడ్లు పెట్టి పొదిగి పిల్లలతో సహా వర్షాలు ప్రారంభమయ్యే సమయంలో వెళ్లిపోతాయి. ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వీటికి విడిది కేంద్రాలున్నాయి. తెలంగాణలో కేవలం ఈ రెండు గ్రామాల్లో మాత్రమే వీటికి నివాసాలున్నాయి. ఈ రెండు గ్రామాల పరిధిలో రెండు చెరువులు, మూడు కుంటలు ఉండటంతో ఇక్కడి చింతచెట్లను ఆవాసాలుగా చేసుకుని సంతానాభివృద్ధి చేసుకుంటున్నాయి. ప్రజలు పక్షులను ఆప్తులుగా భావించి అవసరమైన అన్ని ఏర్పాట్లు కల్పిస్తారు. ఈ అరుదైన పక్షులు విడిది చేసే కాలంలో పర్యటనలకు అనువుగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పర్యాటకం అభివృద్ధి చేస్తే స్థానికంగా పలువురికి ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడతాయని చెప్తున్నారు.

Related Posts