YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

నారాయణను టెన్షన్ పెట్టిన ప్రభుత్వ కాలేజీ..

నారాయణను టెన్షన్ పెట్టిన ప్రభుత్వ కాలేజీ..
ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ ఏడాది పాటు ఎందుకు టెన్షన్‌పడ్డారు? ఏ విషయంలో ఆయన సీఎం చంద్రబాబుని ఆశ్చర్యానికి గురిచేశారు? వై.సి.పి నేతలు మంత్రి నారాయణపై ఎలాంటి ఆరోపణలు చేశారు? వై.సి.పి నేతల తీరుపై నెల్లూరీయులు ఎందుకు గుర్రుగా ఉన్నారు? డాక్టర్ పొంగూరు నారాయణ. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు ఆయన సొంతూరు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు.. దేశవిదేశాల్లో శిష్యులు.. ప్రపంచంలో ఏ మూలకి వెళ్లినా పలుకరించే ఆప్తులు.. ఇదీ ఆయన రేంజ్‌! వాస్తవానికి నారాయణ పేదకుటుంబంలో పుట్టారు. కిరోసిన్ దీపం వెలుగులో చదువుకున్నారు. ఆయన తండ్రి బస్సు కండెక్టర్. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే నారాయణ చదువుకున్నారు. చదువుతోనే ఏదైనా సాధ్యమని గ్రహించారు. డిగ్రీలో యూనివర్శిటీ ఫస్ట్ ర్యాంకు సాధించారు. గోల్డ్ మెడల్ అందుకున్నారు. తిరుపతి ఎస్.వి యూనివర్విటీలో పీజీ చేశారు. అక్కడా కూడా ఫస్ట్ ర్యాంకరే! మరో గోల్డ్ మెడల్ సాధించారు. నెల్లూరులో డిగ్రీ చదువుకున్న వి.ఆర్. కాలేజీలోనే గెస్ట్ లెక్చరర్‌గా చేరారు. అప్పట్లో రోజుకి నాలుగు రూపాయల వేతనం. ఇంటి దగ్గర ట్యూషన్లు మొదలెట్టారు. నారాయణ ప్రతిభని చూసి ఎయిడెడ్ పోస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత అది పర్మినెంట్ అయ్యింది. ఒక పక్క ట్యూషన్లు కూడా కొనసాగిస్తూ అంచలంచెలుగా ఎదిగారు. ప్రైవేటు జూనియర్ కాలేజీలు నెలకొల్పారు. అలా సక్సెస్‌ రేట్‌ పెంచుకుంటూ ఉన్నతస్థాయికి చేరారు. అపర కోటీశ్వరుడయ్యారు. ఇదంతా ఎవరో చెప్పింది కాదు. పేద, మధ్యతరగతి విద్యార్థులను ఉద్దేశించిన అప్పుడప్పుడూ నారాయణ చెప్పే విషయాలే! నారాయణ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని. ఇరవై ఏళ్లపాటు పార్టీకి వెనుక ఉండి పనిచేశారట. ఆయన సేవలను గుర్తించిన చంద్రబాబు ఆయనను పిలిచి మరీ మంత్రి పదవి కట్టబెట్టారట. ఇదీ నారాయణ మంత్రి అవడం వెనుక అసలు కథ! గత ఏడాది నారాయణ ఒక ప్రయోగం చేపట్టారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల అభ్యున్నతి కోసం ఏదైనా చేయాలన్న తలంపు ఆయనకి కలిగింది. ఇందుకోసం ప్రభుత్వ విద్యావిధానంలో మార్పుకి ఏదో ఒకచోట శ్రీకారం చుట్టాలని భావించారు. ఈ నేపథ్యంలోనే ఆయన నెల్లూరు వి.ఆర్. కాలేజీ ఆవరణలో మున్సిపల్ రెసిడెన్షియల్ కాలేజీని ప్రారంభించారు. 49 మంది నిరుపేద విద్యార్థులకి అక్కడ చదువుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు- స్వయంగా ఆయనే ఐ.ఐ.టి, నిట్ ఫౌండేషన్‌తో ప్రత్యేక కోర్సును డిజైన్ చేశారు. వారానికొకసారి మంత్రి నారాయణ ఈ కాలేజీకి వచ్చేవారు. పిల్లలతో మాట్లాడేవారు. వారికి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసే ప్రావీణ్యులైన అధ్యాపకులతో పాఠాలు చెప్పించారు. జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, అధికారులు, మేయర్ అబ్దుల్ అజీజ్ వంటి ప్రముఖులు తరుచూ ఇక్కడికి వచ్చి వసతులు, బోధన తదితర అంశాలను పరిశీలించి వెళ్లేవారు. ఇదిలా ఉంటే.. నెల్లూరుకి చెందిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలకి ఎప్పుడూ ఒకటే పని. అధికారపక్ష నేతలు ఏ కార్యక్రమం చేపట్టినా ఏకపక్షంగా తిట్టిపోయడమే వారికి అలవాటు. ఈ కాలేజీపైనా వారు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. మున్సిపల్ రెసిడెన్షియల్ కాలేజీ పేరు మీద నిధులు దోచేస్తున్నారహో అంటూ ధూంధాం చేశారు. దీంతో గత ఏడాది కాలంగా నగరంలోనే కాదు, జిల్లావ్యాప్తంగా ఇదొక చర్చగా మారింది. ఈ తరుణంలో పరీక్ష ఫలితాలు ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠ అందరిలో ఏర్పడింది. దీనిపై కొంచెం ఎక్కువగా టెన్షన్‌కి గురైంది మంత్రి నారాయణే అని కొందరు చెవులు కొరుక్కున్నారు! అంచనాలు తలకిందులైతే ఎలాంటి విమర్శలొస్తాయోనని టీడీపీ శ్రేణులు, అధికారులు కూడా ఒకింత భీతిల్లారట! ఇటీవల ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు వచ్చాయి. ఇక్కడి విద్యార్థులు అద్భుతం చేసి చూపించారు. నూరుశాతం ఉత్తీర్ణులయ్యారు. అంతే కాదు ఏకంగా 32 మంది పదికి పది పాయింట్లు సాధించారు. 12 మంది 9.8 పాయింట్లు, అయిదుగురు 9 పాయింట్లకి పైగా మార్కులు పొందారు. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఏ కార్పొరేట్ కాలేజీ కూడా సాధించనంత గొప్ప విజయాన్ని అందించారు. ఈ రిజల్ట్‌ చూసిన తర్వాత మంత్రి నారాయణ సహా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయారట. వెంటనే మున్సిపల్ రెసిడెన్షియల్ కాలేజీ విద్యార్థులని తన వద్దకి పిలిపించుకున్నారు. అందరినీ అభినందించారు. ఇదే తరహాలో ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటినీ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టిందట. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీట్లు దొరకకుంటేనే ప్రైవేటు విద్యాసంస్థలకి వెళ్లి చదువుకునే రోజులు రావాలంటూ ప్రభుత్వ పెద్దల్లో చర్చలు కూడా సాగుతున్నాయట. మున్సిపల్ రెసిడెన్షియల్ కాలేజీ విద్యార్థులు పరీక్షల్లో ఎలాంటి ఫలితాలు సాధిస్తారో అన్న ఆసక్తి నిన్నమొన్నటివరకూ నెల్లూరీయులనూ వెంటాడింది. రిజల్ట్‌ చూసిన అనంతరం వారు కూడా సంభ్రమాశ్చర్యాలకి గురయ్యారు. ఈ పరిస్థితుల్లో ఈ కాలేజీలో తమ పిల్లలకి సీటు ఇప్పించాలంటూ మంత్రి నారాయణపై వత్తిడి పెరుగుతోందట. కొందరైతే మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా సిఫార్సులు కూడా చేయిస్తున్నారట. ఈ ఏడాది నగరంలోని ఇతర ప్రభుత్వ కాలేజీల్లోనూ ఇదే తరహా బోధన మొదలుపెట్టి.. మంచి ఫలితాలు సాధించాలని మంత్రి నారాయణ లక్ష్యంగా పెట్టుకున్నారట! ఇన్నాళ్లు ఈ కాలేజీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చిన వై.సి.పి నేతలు, ప్రజాప్రతినిధుల నోళ్లన్నీ పరీక్ష పలితాలు వచ్చాక మూతపడ్డాయి. అయినదానికీ, కానిదానికీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వై.సి.పి నేతల తీరుపై ప్రజలు చిరాకు పడుతున్నారు. ప్రజలకి మేలు జరిగే అంశాలలో సలహాలు, సూచనలూ ఇస్తే కనీసం గౌరవం అయినా దక్కుతుందని చురకలు అంటిస్తున్నారు. చూద్దాం.. ముందు ముందు వారి వైఖరిలో ఏదైనా మార్పు వస్తుందేమో!

Related Posts