మెదక్, ఫిబ్రవరి 23,
పల్లెలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. గ్రామాలను అభివృద్ధికి నమూనాగా మార్చేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా గ్రామాలను స్వచ్ఛతకు చిరునామాగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి వినూత్న ఒరవడికి నాంది పలికారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాములై ముందుకు కదిలేలా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. ఏడాదిన్నరగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం గ్రామాల్లో విజయవంతంగా అమలవుతున్నది. నిర్విరామంగా కొనసాగుతున్న పనులతో పల్లెలు స్వచ్ఛంగా మారాయి. చెత్త సేకరించడం, మొక్కలకు నీళ్లు పట్టి సంరక్షించడం, ముళ్ల పొదలను తొలగించడం కోసం పంచాయతీలకు ట్రాక్టర్లను అందజేశారు. ట్రాక్టర్ల కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ నిధులను వినియోగించారు. దీంతో పంచాయతీలకు సొంతంగా వాహనాలు సమకూరాయి. ఉమ్మడి జిల్లాలో ప్రతి జీపీకి ట్రాక్టర్ ఓ ఆస్తిగా మారింది.ఏడాదిన్నర క్రితం వరకు గ్రామాల్లో చెత్త సేకరణ, మురికి కాలువలు శుభ్రం చేసేందుకు సరైన వ్యవస్థ ఉండేది కాదు. పల్లె ప్రగతి అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ తప్పనిసరి చేయడంతో పాలకవర్గాలు తీర్మానం చేసి వాహనాలను కొనుగోలు చేశాయి. జనాభా ఆధారంగా వాహనాల సామర్థ్యాన్ని బట్టి ట్రాక్టర్లు జీపీలకు తీసుకొచ్చారు. ట్రాక్టర్ ఇంజిన్‌తోపాటు ట్రాలీ, ట్యాంకర్ ఏర్పాటు చేసుకోవడంతో జీపీలకు బలం చేకూరింది. ఒక రోజంతా వంద మంది చేసే పనిని ట్రాక్టర్ ద్వారా గంటల వ్యవధిలోనే చేసే అవకాశం లభించడంతో గ్రామాల్లో పనుల నిర్వహణ సులువుగా మారింది. రోడ్లకు ఇరువైపులా, వీధుల్లో మొక్కలు నాటి ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నారు. దీంతో నాటిన మొక్కల్లో అధిక శాతం పెరుగుతున్నాయి. గతంలో మొక్కలకు నీళ్లు అందించేందుకు సరైన వ్యవస్థ లేదు. ప్రస్తుతం ట్రాక్టర్ అందుబాటులోకి రావడంతో ఇబ్బందులు తప్పాయి. గ్రామంలో ఇంటింటికీ చెత్త సేకరణకు ట్రాక్టర్ వినియోగిస్తున్నారు. సేకరించిన చెత్తను కంపోస్ట్‌షెడ్‌కు తరలించి సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. ట్రాక్టర్ కొనుగోలు ప్రక్రియ జీపీకి భారం కాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పంచాయతీల్లో అందుబాటులో ఉన్న నిధులను లెక్కగట్టి ట్రాక్టర్ విలువలో సుమారు 40 శాతం సొమ్ము చెల్లించడం, 60 శాతం బ్యాంకుల నుంచి రుణం పొందేలా చర్యలు తీసుకున్నారు. ట్రాక్టర్ ద్వారా పంచాయతీ పరిధిలో కొంత మందికి ఉపాధి లభిస్తోంది. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ కేటాయించినపుడు డ్రైవర్, పారిశుద్ధ్య కార్మికులను నియమించుకునే సౌలభ్యం కలిగింది. నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు పూర్తి స్థాయిలో సమకూర్చారు. కామారెడ్డి జిల్లాలో 526 గ్రామ పంచాయతీలకు గాను ఇదివరకే 3 జీపీలకు ట్రాక్టర్లుండగా... ఏడాదిన్నర క్రితం 523 జీపీలకు ట్రాక్టర్లు కొత్తగా కొనుగోలు చేశారు. వీటిలో 513 జీపీల్లో ట్రాలీలు, 526 జీపీల్లో ట్యాంకర్లు సైతం అందుబాటులో ఉన్నాయి.గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు సమకూర్చడంతో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరణ, మొక్కలకు నీళ్లు పోయడం, ముళ్ల పొదలను తొలగించే ప్రక్రియ సులువుగా మారింది. ప్రజలకు మేలు చేసే ఏ అవసరానికైనా ట్రాక్టర్‌ను వినియోగిస్తున్నారు. మనుషులు చేయలేని పని ట్రాక్టర్ల ద్వారా చేస్తున్నారు.