YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

పాలన అస్తవ్యస్తం

పాలన అస్తవ్యస్తం
అసలే నిధుల్లేక విలవిల్లాడుతున్న జిల్లా, మండల పరిషత్‌లలో పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. పర్యవేక్షణ అధికారుల ఖాళీలతో పనులేవీ ముందుకు సాగడం లేదు. పూర్వ జిల్లాలో మొత్తం 57 మండలాలకు 21 ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. మండల పరిధిలోని ఇతర అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించి ఎంపీడీవోలుగా కొనసాగిస్తున్నారు. ఏళ్లుగా ఇలాగే కొనసాగుతోంది.. మరోవైపు కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా సర్పంచి ఎన్నికలకు కసరత్తు జరుగుతోంది. మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఇతర పంచాయతీ డివిజన్‌ అధికారుల సారథ్యంలో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే ఉపాధి పనుల పర్యవేక్షణ, సంక్షేమం, తాగునీటి కొరత వంటి వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మండలాల్లో అధికారులు, సిబ్బంది కొరతతో ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు. కొత్త మండలాలు ఏర్పడినప్పటికీ వాటి ఊసే లేదు. జిల్లా పరిషత్‌లోనూ డిప్యూటీ సీఈవోతో పాటు ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పూర్వ జిల్లా నుంచి విడిపోయిన కరీంనగర్‌ జిల్లాలో 2, జగిత్యాల జిల్లాలో 6, పెద్దపల్లిలో 5, రాజన్న సిరిసిల్లలో 4, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరి స్థానంలో 4 చోట్ల ఇతర మండలాల్లో పని చేస్తున్న ఎంపీడీవోలు 12 మండలాల్లో ఈవోఆర్‌డీలు, మిగిలిన ఐదు మండలాల్లో మండల పర్యవేక్షకులు ఎంపీడీవోలుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 21 మండలాల్లో పనిచేసే వీరు రెండు బాధ్యతలు నిర్వహించడంతో దేనికీ న్యాయం చేయలేని పరిస్థితి. ఎంపీడీవోలు పూర్తి స్థాయి అధికారులు ఉంటేనే మండల అభివృద్ధితో పాటు ఇతర పనులు కొనసాగుతాయి. ఒకే అధికారికి రెండు చోట్ల బాధ్యతలు అప్పగించడంతో అనుకున్న స్థాయిలో ప్రగతి సాధించడం లేదు. ఇక మండల పర్యవేక్షకులు కార్యాలయంలోనే ఉండి అన్ని పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ, వారికే రెండు బాధ్యతలు అప్పగించడంతో పర్యవేక్షణపై పట్టు లేకుండా పోతోంది. గ్రామీణాభివృద్ధి కార్యనిర్వాహణాధికారులు గ్రామ పంచాయతీల పనితీరు పర్యవేక్షణ ఇతర పనులపై దృష్టి సారించాలి. వీరికి ఎంపీడీవో బాధ్యతలు అప్పగించడంతో ఆ పనులు పక్కకు వెళ్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పర్యవేక్షకులు, గ్రామీణ అభివృద్ధి కార్యనిర్వహణ అధికారులకు ఎంపీడీవోలుగా పదోన్నతులు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంతో పూర్తి స్థాయి ఎంపీడీవోల పోస్టులు భర్తీ కావడం లేదు. రెగ్యులర్‌ నియామకాల విషయంలోనూ ప్రభుత్వానికి పట్టింపులేదు. ఫలితంగా అదనపు బాధ్యతల అధికారులతో పాలన కొనసాగుతోంది. కరీంనగర్‌ జిల్లాలోని తిమ్మాపూర్‌, రామడుగు, జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి, మల్లాపూర్‌, రాయికల్‌, మల్యాల, పెగడపల్లి, కొడిమ్యాల్‌, పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, ఓదెల, కమాన్‌పూర్‌, ముత్తారం మంథని, శ్రీరాంపూర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ, బోయినిపల్లి, గంభీరావుపేట్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మల్హార్‌ మహదేవ్‌పూర్‌, కాటారం, మహాముత్తారం మండలాల్లో ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలతో పాటు పలు జిల్లాలో పదికి పైగా మండలాలు ఏర్పడ్డాయి. అక్కడ మండల పరిషత్‌లను ఏర్పాటు చేయలేదు. ఉన్న మండలాలకే అధికారులు లేకపోతే కొత్త మండలాల అధికారులను తెచ్చి ఎలా ఏర్పాటు చేస్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా పరిషత్‌లో డిప్యూటీ సీఈవోతో పాటు లెక్కల అధికారి పోస్టులు ఖాళీ ఉన్నాయి. అసలే నిధుల కొరతతో సతమతమవుతున్న జడ్పీకి ప్రధాన అధికారులు కూడా లేరు. ప్రస్తుతం ఉన్న సీఈవో పద్మజారాణి డిప్యూటీ సీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గణాంక అధికారిగా చిగురుమామిడి ఎంపీడీవో శ్రీనివాస్‌ అదనపు బాధ్యతల్లో ఉన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో కొత్తగా నాలుగు జిల్లా పరిషత్‌లు ఏర్పాటు కానున్నాయి. పాత జిల్లాకే ప్రధాన అధికారులు లేరు. కొత్త జిల్లాలకు అధికారులను ఎక్కడి నుంచి తీసుకొస్తారన్న చర్చ సాగుతోంది. కాగా ఎంపీడీవోల ఖాళీలు జడ్పీ అధికారుల విషయమై అనేక సార్లు ప్రభుత్వానికి నివేదికలు పంపామని ఖాళీలు మాత్రం భర్తీ కావడం లేదని సంబంధిత అధికారులు చెబుతన్నారు. ఖాళీలు ఉన్నచోట అదనపు బాధ్యతలు అప్పగించి పనులు జరిగేలా చూస్తున్నామని వివరించారు

Related Posts