అదిలాబాద్, ఫిబ్రవరి 23,
ఏడాది కాలంగా ముప్పుతిప్పలు పెడుతున్న కరోనా మహమ్మారి భయం ఇంకా వీడడం లేదు. 2020 ఏడాది మొత్తం కరోనా భయంతోనే గడిచిపోయింది. తాజాగా 2021లోనూ ఇంకా దీని ప్రభావం పూర్తిగా తొలగి పోనప్పటికీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కొంతమేర ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఎక్కడినుంచి ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనని జనం ఇంకా ఆందోళనతోనే ఉన్నారు. ఈ రెండు నెలల నుంచి కరోనా ఉధృతి తగ్గిందని కొంత ఉపశమనం పొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులకు పొరుగు భయం వెంటాడుతోంది. జిల్లా సరిహద్దున ఉన్న మహారాష్ట్రలో రెండో దశ కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చడంతో ఆ ప్రభావం జిల్లాపై పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. విదర్భ ప్రాంతంలోని యవత్‌మాల్, ఆకోలా తదితర జిల్లాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ఈ ప్రభావం జిల్లాపై పడే అవకాశం ఉంటుందని అధికార యంత్రాంగం భావిస్తోంది. ముందస్తుగా అప్రమత్తమై నివారణ చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే జిల్లాలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌లో 55 శాతం మందికి టీకా వేయడం పూర్తి కాగా సోమవారం నుంచి ప్రయివేటు వారికి అందించేందుకు సిద్ధమవుతోంది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు జిల్లాలో 2.37 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5130 మందికి పాజిటివ్ వచ్చినవారిలో చాలామంది కోలుకున్నారు. పరిస్థితి క్షీణించి పలువురు మృతిచెందారు. నెమ్మదిగా పరిస్థితి కుదుటపడింద నుకుంటున్న సమయంలో ఇప్పుడు మళ్లీ మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుంది. ఒక్క రోజులో 6 వేల కేసులు నమోదు కాగా, 44 మంది చనిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా తీవ్రస్థాయిలో ఉండటంతో పొరుగునే ఉన్న జిల్లాపై ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు మొదలయ్యాయి. బస్సులు, ప్రయివేటు వాహనాలు తిరుగుతున్నాయి. జిల్లా సరిహద్దున అనేక గ్రామాల ప్రజలకు విదర్భ ప్రాంత ప్రజలకు సత్సంబంధాలు, బంధుత్వాలున్నాయి. ఫంక్షన్లకు కూడా వెళ్లి వస్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో జనాలు వివిధ పనుల నిమిత్తం సరిహద్దు దాటి జిల్లాకు రావడం, పోవడం చేస్తున్నారు. తాజాగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. యవత్‌మాల్ జిల్లాలో రాత్రి వేళలో కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కేసులు మరింత పెరిగితే పూర్తిగా లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని సమాచారం.అప్రమత్తమైన యంత్రాంగంకొన్ని రోజులుగా పక్కనే ఉన్న మహారాష్ట్రలో మళ్లీ కరోనా విజృంభించడంతో సరిహద్దునున్న జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. టీకా వచ్చిన తర్వాత ఆయా శాఖలకు చెందిన కరోనా యోధులు 6913 మందిని గుర్తించి 3276 మందికి టీకా వేశారు. మరో 435 మంది ప్రయివేటు వ్యక్తులకు టీకా అందించినట్టు అధికారులు చెబుతున్నారు.మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న అధికారులు జిల్లావాసులు మరోసారి కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై శనివారం వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ముందస్తుగా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై ప్రణాళిక రూపొందించినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. సరిహద్దున ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్రమత్తం చేశారు. ఎవరైనా మహారాష్ట్ర నుంచి ఎవరైనా జిల్లాలోకి ప్రవేశిస్తే వెంటనే సమాచారం అందించాలని స్పష్టం చేశారు. వారికి వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు. జిల్లావాసులు కరోనా నిబంధనలు పాటిస్తేనే దీని బారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగించడం, భౌతికదూరం పాటించడం లాంటివి కొనసాగించాలని సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.