హైదరాబాద్ ఫిబ్రవరి 23, బోధన్ పాస్‌పోర్ట్ కేసులో విచారణ వేగవంతం చేసినట్లు పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఈ కేసులో భాగంగా ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వీరిలో ఇద్దరు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. నలుగురు బంగ్లాదేశీయులు, ఒకరు పశ్చిమబెంగాల్, ఒకరు ఏజెంట్, ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఒకే చిరునామాస్‌పై 32 పాస్‌పోర్టులు జారీ అవడం కలకలం రేపింది. దీనిలో ఇప్పటివరకు 72 పాస్ పోర్టులు గుర్తించినట్లు వివరించారు. హైదరాబాద్‌లోని కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.ఒకే చిరునామాపై భారీ సంఖ్యలో పాస్‌పోర్టులు ఉండడంపై ఇప్పటికే ఇమ్మిగ్రేషన్, రీజనల్ పాస్‌పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చినట్లు సజ్జనార్ తెలిపారు. ఎంతమంది దేశం దాటి వెళ్లారనేది విచారణ చేస్తున్నట్లు చెప్పారు. అధికారులు, స్థానికుల పాత్రపైనా కూడా విచారణ చేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే మిగతా వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ పొందారని, ఎంతమంది దేశం దాటి వెళ్లారు, ఎంతమంది పాస్‌పోర్టులు పొందారనేది విచారణ చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. కస్టడీకి తీసుకొని విచారిస్తామని పేర్కొన్నారు. పాస్‌పోర్ట్ పరిశీలనలో లోపాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. దోషులు ఎవరైనా వదిలేది లేదని స్పష్టం చేశారు.