YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

కాస్త దృష్టిపెడితే.. కష్టాలు తీరినట్టే..

కాస్త దృష్టిపెడితే.. కష్టాలు తీరినట్టే..
ఖమ్మం, ఏప్రిల్ 24 (న్యూస్ పల్స్): ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం నీటి సదుపాయం లేని ప్రాంతం. వర్షాకాలంలో నీరు వృథాగా పల్లానికి ప్రవహిస్తుంటే.. వేసవిలో నీటి ఎద్దడి షరామామూలే. వీటి పరిష్కారంగా మండలంలోని మెజారిటీ చెరువులను నింపే సౌకర్యం లేకపోలేదు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణ సమీపంలో ఇల్లెందుపాడు చెరువు వద్ద అలుగుపడ్డ చెరువు నుంచి బుగ్గవాగు ప్రారంభమవుతుంది. ఇదే పట్టణంలోని నెంబర్‌2 బస్తీ పైభాగంలో కురిసిన వర్షం నీరంతా కలిసి వాగుగా ఖమ్మం జిల్లా కారేపల్లి మండలానికి చేరుతుంది. స్థానికంగా వర్షం నీరంతా సాగు భూమిని కోతకు గురిచేయడంతో కారేపల్లి మండలం గేటుకారేపల్లి వద్ద చెక్‌డ్యాం రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించారు. గత ఏడాది ఈ పనులు పూర్తి చేసుకున్నాయి. ఈ చెక్‌డ్యాం నిండిన తర్వాత వచ్చే అలుగు నుంచి బుగ్గవాగు ప్రవాహం కొనసాగుతుంది. కొంత దూరం వచ్చిన తర్వాత ఎలాంటి కాలువ నిర్మాణం లేకపోవడంతో పంట భూముల నుంచి నీరంతా వృథాగా వెళ్తోంది. ఈ నీటిని ఒడిసిపట్టే ప్రయత్నం చేస్తే రఘునాథపాలెం మండల రైతులకు సాగునీరు చేరువ కానుంది. రఘునాథపాలెం మండలం రెండు భాగాలుగా స్పష్టంగా విభజితమై ఉంటుంది. ఖమ్మం-ఇల్లెందు ప్రధాన రహదారి ఈ మండలాన్ని రెండుగా విభజిస్తుంది. రోడ్డుకు దిగువ వైపు బుగ్గవాగు నీటిని తరలించేందుకు వీలుంది. రోడ్డుకు ఎగువ ప్రాంతం కావడంతో నీటి తరలింపు సీతారామ ఎత్తిపోతల పథకమే శరణ్యం. బుగ్గవాగు ప్రవహించే వైపు కాలువలు నిర్మిస్తే సత్ఫలితాలు కనిపిస్తాయి. కాలువ నిర్మాణానికి 21.7 కి.మీటర్లు పనుల చేపట్టాల్సి ఉంది. దానిలో 7 కి.మీటర్లు రఘునాథపాలెం మండలంలో నిర్మించాలి. తద్వారా మండలంలోని ప్రధాన చెరువు 08 నిండుతాయి. 1,114 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. చిన్నచిన్న చెరువులు, కుంటలు నిండుతాయి. పలుబోర్లు, బావులు రీఛార్జి అవుతాయి. మెజారిటీ చెరువులను మిషన్‌ కాకతీయ పనుల్లో భాగంగా ఆధునికీకరణ చేశారు. తద్వారా నీటి నిల్వకు ఆస్కారం ఎక్కువగా ఉంది. కాస్తంత శ్రద్ధవహించి బుగ్గవాగు నీటిని మంచుకొండ సమీపంలోని రాయల చెరువలో పడేస్తే అక్కడ నుంచి వరుసగా ఉన్న గొలుసుకట్టు చెరువులు నిండుతాయి. తద్వారా చెరువుల కింద ఉన్న ఆయకట్టుతోపాటు బోర్లు, బావుల కింద ఉన్న ఆయకట్టు కూడా సాగులోకి వచ్చే వీలుంది. మండల వ్యాప్తంగా సుమారు 30 వేల ఎకరాల సాగుభూమి ఉంది. దీనిలో ఎక్కువ శాతం ఆరుతడి పంటలకే రైతులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధాన కారణం సాగునీటి వనరులు లేకపోవడమే. 30 వేల ఎకరాల సాగు భూమి ఉన్న మండలంలో కేవలం 3 వేల ఎకరాలు మాత్రమే వరి సాగవుతుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రఘునాథపాలెం మండలంలో కరవును పారదోలాలంటే ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాలనలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు స్పందించి బుగ్గవాగు నీటిని ఒడిసిపట్టాల్సిన అవసరం ఉంది. పక్కా కాలువలకు ప్రతిపాదనలు చేసి, అనుమతులు తీసుకొచ్చి, పనులు సకాలంలో పూర్తి చేయాలి. తర్వాత చెరువులు నిండి.. బావులు, బోర్లు నీటితో కళకళలాడితే ఆరుతడి పంటలకే ఆనవాళ్లుగా మారిన మండలంలో ‘వరి’ పంటలు విరివిగా పండే వీలుంది. ఏడాదికోసారి పంటే ఆరుతడి పంటలు కాకుండా రెండు పంటలు పండించే వీలుంది. రైతు ఆర్థికంగా బలోపేతం కావడమే కాకుండా స్పందించి పనులు పూర్తి చేయించిన ప్రజాప్రతినిధులను అక్కున చేర్చుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Posts