మోదీ ఉద్యోగమివ్వండి’ నినాదంతో హోరెత్తిపోతోన్న ట్విటర్
న్యూఢిల్లీ ఫిబ్రవరి 23
మీరు ట్విటర్ ఫాలోవర్లయితే అందులో టాప్ ట్రెండ్స్‌ను గమనించే ఉంటారు. మోదీ రోజ్‌గార్ దో (మోదీ ఉద్యోగమివ్వండి) నినాదంతో ట్విటర్ హోరెత్తిపోతోంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌తో ఇప్పటికే 30 లక్షలకుపైగా ట్వీట్లు రావడం గమనార్హం. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, ఉద్యోగమో రామచంద్రా అని నిరుద్యోగులు చేస్తున్న హాహాకారాలకు ఈ ట్వీట్లు అద్దం పడుతున్నాయి. కరోనాను తప్పుబట్టడం కాదు కానీ.. మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దేశంలో నిరుద్యోగం పెరిగిపోతూనే ఉన్నదని గణాంకాలు చెబుతున్నాయి. ఆ ఫలితమే ఇప్పుడీ మోదీ.. రోజ్‌గార్ దో ఉద్యమం.
కొవిడ్ మహమ్మారి దాడి చేయకముందు 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో మొత్తం 40.35 కోట్ల మంది ఉద్యోగాలు చేస్తుండగా.. 3.5 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ నంబర్లకు ప్రతి ఏటా ఇండియా మరో కోటి మంది ఉద్యోగార్థులను యాడ్ చేస్తూనే ఉంటుంది. ఇక కరోనా కారణంగా ఇంకొన్ని కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో 2021, జనవరి నాటికి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ల సంఖ్య 40 కోట్లకు పడిపోయింది. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తామని చెప్పుకుంటూ మోదీ అధికారంలోకి వచ్చారు. కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు వ్యాస్/ సీఎంఐఈ డేటా స్పష్టం చేస్తోంది. 2016 నుంచి దేశంలో ఉద్యోగుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గుతూ వస్తోంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 40.73 కోట్ల మంది ఉద్యోగులు ఉండగా అది 2017-18కి 40.59 కోట్లకు, 2018-19కి 40.09 కోట్లకు పడిపోయింది. ఒకవైపు భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నా.. నిరుద్యోగ రేటు కూడా దాంతోపాటే పెరగడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగుల సంఖ్య 4.5 కోట్లకు చేరింది.ఈ 4.5 కోట్ల మంది కూడా ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్లే. కానీ వీళ్లకు ఎలాంటి ఉద్యోగాలు దొరక్క నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. నిజానికి నిరుద్యోగం ఇంతకంటే చాలా ఎక్కువే ఉంది. అదెలాగో చూద్దాం. భారత జనాభా పెరుగుదల చూసుకుంటే.. ప్రతి ఏటా పని చేసే వయసు (15 నుంచి 59 ఏళ్లు)లోకి ఎంటరయ్యే వాళ్ల సంఖ్య సుమారు 2 కోట్లు. ఇందులో అందరూ ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్లే ఉండరు. ఉద్యోగం చేయడానికి భయపడే యువతులు కొంతమందైతే.. ఎన్నోసార్లు ప్రయత్నించిన తర్వాత కూడా ఉద్యోగాలు రాక ఇక ఆశలు వదిలేసిన వాళ్లు మరికొందరు. ఇలా ఉద్యోగాలు రాక ప్రయత్నాలు వదిలేసే యువత పెరిగిపోతే దేశ లేబర్ ఫోర్స్ పార్టిసిపేన్ రేటు (ఎల్ఎఫ్‌పీఆర్) పడిపోతుంది. ఇండియాలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో ఎల్ఎఫ్‌పీఆర్ 40 శాతం మాత్రమే. అంటే ప్రతి ఏటా ఉద్యోగం చేసే వయసులోకి వస్తున్న వాళ్లలో 40 శాతం మంది మాత్రమే ఉద్యోగం కోసం చూస్తున్నారు. వాళ్‌ంలోనే ఇప్పటికీ 4.5 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 60 శాతంగా ఉంటుంది.
బడ్జెట్‌తో మరింత డేంజర్
ఇప్పటికే నిరుద్యోగ రేటు పెరిగిపోతోందంటే తాజా బడ్జెట్ ఈ ముప్పును మరింత పెంచేలా కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ పాత్రను తగ్గించేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కొత్త ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ పాత్రను పరిమితం చేయడమే లక్ష్యంగా మోదీ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. ప్రైవేటు రంగం ఆశించిన మేర ఉద్యోగాలు కల్పించడం లేదు. పైగా కరోనా దెబ్బకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మరో రెండేళ్లు ఇదే పరిస్థితి ఇలాగే ఉండేలా కనిపిస్తోంది. ఆలోపు మరికొన్ని కోట్ల మంది నిరుద్యోగుల జాబితాలో చేరిపోనున్నారు.