YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తిరుపతిలో పోటీకి జనసేన

తిరుపతిలో పోటీకి జనసేన

తిరుపతిలో పోటీకి జనసేన
తిరుపతి, ఫిబ్రవరి 24
పవన్ కల్యాణ్ జనసేన అభ్యర్థిని బరిలోకి దింపాలని గట్టిగా కోరుకుంటున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థి ఉండాలని పవన్ కల్యాణ్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికపైన ఇప్పటికి రెండు సార్లు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి వచ్చారు. అధిష్టానం పెద్దలను కలిశారు. తమ పార్టీ క్యాడర్ జనసేన అభ్యర్థి బరిలో ఉండాలని బలంగా కోరుకుంటున్నారని, ఈసారి అవకాశం ఇవ్వాలని పవన్ కల్యాణ్ కోరి వచ్చారు.రెండు సార్లు ఢిల్లీ వెళ్లిందీ పవన్ కల్యాణ‌్ తిరుపతి ఉప ఎన్నికల విషయంలో స్పష్టత కోసమే. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అందులో ఒకటి కావచ్చు కాని పవన్ కల్యాణ్ ప్రాధాన్యత మాత్రం తిరుపతి ఉప ఎన్నికే. ఇప్పటికే జనసేన అధినేత తిరుపతిలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి క్యాడర్ అభిప్రాయాలను తెలుసుకున్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో బీజేపీ కంటే జనసేన బలంగా ఉందని పవన్ కల్యాణ్ సయితం అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది.బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తిరుపతిలో తాము పోటీ చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. సోము వీర్రాజు తిరుపతి ఉప ఎన్నికపైనే ప్రధానంగా దృష్టి పెట్టి నట్లు చెబుతున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు దాసరి శ్రీనివాసులు, రత్నప్రభల పేర్లను పరిశీలిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఢిల్లీ పెద్దలను కలసి వచ్చినా చివరకు తమ పార్టీ అభ్యర్థి ఖరారవుతారన్న విశ్వాసంతో ఉన్నారు.దీంతో మార్చి మొదటి వారంలో అమిత్ షా తిరుపతికి రానున్నారు. ఈ సమావేశంలో అభ్యర్థి ఎవరనేది తేల్చనున్నారు. పవన్ కల్యాణ్ మాత్రం ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత జనసేన అభ్యర్థి బరిలో ఉంటారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్లమెంటు ఎన్నిక కావడంతో తామే పోటీ చేయాలని బీజేపీ నేతలు కూడా గట్టిగా పట్టుబడుతున్నారు. మొత్తం మీద ఈసారైనా పవన్ కల్యాణ్ తన అనుకున్నది సాధిస్తారా? లేదా బీజేపీ నేతల ఆదేశాలను పాటిస్తారా? అన్నది చూడాల్సి ఉంది.

Related Posts