YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

శతాబ్దిని తలదన్నే హైస్పీడ్ రైలు..ఎస్ మణి

శతాబ్దిని తలదన్నే హైస్పీడ్ రైలు..ఎస్ మణి

- వేగం, ప్రపంచ స్థాయి సౌకర్యాల్లో మేటి..

-  ప్రయాణ సమయాన్ని 20% తగ్గించే ట్రైన్-18

- జూన్ 2018 నాటికి అవి పట్టాలు ఎక్కుతాయి..

- ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ ఎస్ మణి

భారత్‌లో  ప్రస్తుతం హైస్పీడ్ రైళ్లంటే శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లే. అయితే, వాటిని తలదన్నే రీతిలో మరో రెండు రకాల రైళ్లు పట్టాలపై పరుగులు తీసేందుకు సిద్ధమవుతున్నాయి. రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించే ప్రపంచ ప్రమాణాలు కలిగిన సెమీ హై స్పీడ్ రైళ్లు జూన్ నుంచి ప్రయాణికులతో పరుగులు తీసేందుకు తయారవుతున్నాయి. ప్రయాణ సమయాన్ని 20 శాతం వరకు తగ్గించే ఆ రైళ్లు.. రైల్వేలో తొలిసారిగా పట్టాలపైకి ఎక్కబోతున్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్).. 16 ఏసీ కోచ్‌లను తయారు చేస్తోంది. ట్రైన్-18 పేరిట తయారవుతున్న ఈ కోచ్‌లు జూన్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన సౌకర్యాలను ఈ కోచ్‌లలో కల్పించబోతున్నారు. వైఫై, ఎంటర్‌టైన్మెంట్, జీపీఎస్ ఆధారిత ప్రయాణికుల సమాచార వ్యవస్థ, ఆహ్లాదభరితమైన ఇంటీరియర్, ఎల్‌ఈడీ లైటింగ్ వ్యవస్థ వంటి అధునాతన సదుపాయాలను ఈ 16 కోచ్‌లలో కల్పిస్తున్నారు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్థానంలో, వాటిని తలదన్నేలా ఈ ట్రైన్-18 రైళ్లను తయారు చేస్తున్నారు.

ఇక, మరో ఉన్నత వర్గ రైలు అయిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో ట్రైన్-20 పేరిట మరో వర్గం సెమీ హైస్పీడ్ రైళ్లను తయారు చేస్తున్నారు. వాటిని 2020లో అందుబాటులోకి తెస్తారు. ఈ రెండు రకాల రైళ్లను మేకిన్ ఇండియాలో భాగంగానే అభివృద్ధి చేస్తున్నారు. ఇక, ఈ రెండు రకాల రైళ్లకు ఉన్న ప్రధాన తేడా.. వాటి బాడీనే. ట్రైన్ 20 బాడీని అల్యూమినియంతో తయారు చేస్తే.. ట్రైన్ 18 బాడీని స్టెయిన్‌లెస్ స్టీల్‌తో అభివృద్ధి చేస్తున్నారు. ఈ రెండు రకాల రైళ్లలో అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. అధునాతన లుక్ కోసం మొత్తం గ్లాస్ కిటికీలనే ఏర్పాటు చేస్తున్నారు. దాంతో పాటు స్టేషన్ రాగానే డోర్లు, కిందకు దిగే మెట్లు వాటంతట అవే తెరచుకునేలా స్లైడింగ్ డోర్లు, స్లైడింగ్ ఫుట్‌స్టెప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ట్రైన్ 18 రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని, ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సౌకర్యాలు కల్పిస్తామని, జూన్ 2018 నాటికి అవి పట్టాలు ఎక్కుతాయని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ ఎస్ మణి తెలిపారు. 

Related Posts