కిడ్నాప్ నాటకమాడిన ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్ ఫిబ్రవరి 25
ఘట్కేసర్లో కిడ్నాప్ నాటకమాడిన ఫార్మసీ విద్యార్థి(19) ని ఆత్మహత్యకు పాల్పడింది. నిద్ర మాత్రలు మింగి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. కిడ్నాప్ నాటకం వెలుగు చూసిన తర్వాత యువతి ఘట్కేసర్లోని తన మేనమామ ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు మొత్తం డ్రామా అని తేలడంతో పోలీసులు యువతి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు.
కిడ్నాప్ నాటకమాడిందిలా...
నలుగురు వ్యక్తులు అపహరించి, సామూహిక అత్యాచారం చేశారంటూ కీసరకు చెందిన బీఫార్మసీ విద్యార్థిని చెప్పిందంతా కట్టుకథ అని పోలీసులు తేల్చారు. తొలుత బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా సామూహిక అత్యాచారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలు సేకరించాక అత్యాచారం జరగలేదనే నిర్ధారణకు వచ్చారు. ఇల్లు వదిలి వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో వేర్వేరు ప్రాంతాల్లో తిరిగానని, ఆ సమయంలో తల్లి భయపెట్టడంతో అత్యాచారం అనే నాటకాన్ని అమలుచేశానని బాధితురాలు అంగీకరించినట్టు పోలీసులు చెప్పారు. ఇందుకు విద్యార్థిని చేసిన ప్రయత్నాలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ గతంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.